కాంగ్రెస్ లో కొట్లాటలు మళ్లీ రచ్చకెక్కాయి. మొన్న పార్టీ సీనియర్లతో రాహుల్ భేటీ తర్వాత పంచాయితీలు ముగిశాయని అనుకుంటున్న సమయంలో సునీతా రావు, కవిత మధ్య వివాదం చెలరేగింది. దానిపై ఇంకా చర్చ నడుస్తుండగానే.. తాజాగా.. ఎన్‌ఎస్‌యూఐ నేతలు కొట్టుకున్నారు.
ఇందిరా భవన్ లో ఎన్‌ఎస్‌యూఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రెసిడెంట్ వెంకట్, వైస్ ప్రెసిడెంట్ చందనా రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. అయితే.. వెంకట్, చందనా రెడ్డి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం చెలరేగింది.
సమావేశానికి వచ్చిన వారు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకునే వరకు వెళ్లారు. గత రెండేళ్లుగా ఎన్‌ఎస్‌యూఐ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టకపోవడంపైనే వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదానికి దిగారు.
గత శనివారం గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. మహిళా నేతలు సునీతా రావు, కవిత మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటన ప్రస్తుతం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. ఎన్‌ఎస్‌యూఐ నేతలు కూడా కొట్టుకోవడం చూసి కాంగ్రెస్ లో పంచాయితీలు మళ్లీ మొదలయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.