మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ఊహించని రీతిలో పావులు కదిపింది. ఎన్సీపీ, శివసేన లో చీలిక తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో బల నిరూపణకు గవర్నర్ ఈ నెల 30 వరకు గడువు విధించడంతో శాసనసభలో మెజార్టీ నిరూపించుకుంటామంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేయడం వెనుకు ఎన్సీపీ, శివసేన లో చీలికల విషయం స్పష్టమవుతుంది. శాసనసభలో తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతుందని బీజేపీ వెల్లడించింది. ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు నిస్తున్నట్టు గవర్నర్ కు అజిత్ పవార్ లేఖ ఇచ్చినట్టు తెలిపింది. ప్రస్తుతం ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా అజిత్ పవార్ ఉన్నందున ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉంటుందని బీజేపీ అంటోంది. అయితే వారిలో ఎంత మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు నిస్తారనే విషయంపై స్పష్టత లేదు. తాము బీజేపీకి మద్దతు ప్రకటించడం లేదని..అజిత్ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదని ఓ వైపు శరద్ పవార్ చెప్పడాన్ని బట్టి చూస్తే ఎన్సీపీలో చీలిక వచ్చినట్టు అర్ధమవుతుంది. అలాగే శివసేనలో కూడా కొంత మందిని బీజేపీ తమ వైపుకు లాక్కుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏ పార్టీ నుంచి ఎవరెవరు బీజేపీకి మద్దతు నిస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. వారి పేర్లు బయటకు రావడం లేదు. అంతా గోప్యంగా వ్యవహారం నడుస్తోంది. మొత్తం శాసన సభ స్థానాల్లో బీజేపీకి 105 మంది…శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ కు 44, ఇతరులు 29 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీకి 145 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరముంది.