ముందొచ్చిన చెవుల కంటే.. వెనుకొచ్చిన కొమ్ములు వాడిగా ఉండటం సహజమే. కానీ కొమ్ములు ఎంత పదునుగా ఉన్నా.. ఇంద్రియ జ్ఞానం ఉన్న చెవుల కంటే గొప్పవి కాలేవు. అది అర్థం చేసుకోకపోతే ఏదో రోజు కొమ్ములకు నష్టం తప్పదు. సామెత సంగతి పక్కనబెడితే వనపర్తి జిల్లాకు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్ మధ్య పరిస్థితి మాత్రం సరిగ్గా ఆ సామెతలాగే ఉంది. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న ఈ పార్టీ నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. చాన్నాళ్లుగా జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు లోక్‌నాథ్‌ను నిరంజన్ రెడ్డి దూరంపెట్టడం చర్చనీయాంశంగా మారింది. కారణమేంటని ఆరా తీస్తే ఓ ఆసక్తికర విషయం బయటపడింది.వనపర్తి జిల్లాలో మొదటి నుంచి నిరంజన్ రెడ్డి హవానే కొనసాగుతూ వస్తోంది. మంత్రి పదవి దక్కినాక అది మరింత పెరిగింది. సాధారణంగా జిల్లాలో మెజార్టీ నేతలకు ఆయన చెప్పిందే వేదం. అలాంటిది కొన్నాళ్లుగా మంత్రినే ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారట జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్. తాను కూడా కేబినెట్ ర్యాంకు పదవిలోనే ఉన్నానని, మంత్రికి ఇచ్చే గౌరవాన్నే తనకూ ఇవ్వాలని, ప్రోటోకాల్‌ను పాటించాలని అధికారులు, పార్టీ నేతలకు ఆర్డర్ వేస్తున్నాడట. తానకు కూడా స్వతంత్రంగా కార్యక్రమాలు చేపట్టే హోదా ఉందని..అయితే నిరంజన్ రెడ్డి కారణంగా అలా జరగడంలేదని వాపోయేవాడట. ఆ నోటా, ఈ నోటా మంత్రి నిరంజన్ రెడ్డి చెవినపడటంతో లోక్‌నాథ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిననట్టుగా తెలిసింది. నాటి నుంచి జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలు లోక్‌నాథ్‌కు తెలియకుండానే జరిపిస్తున్నారు నిరంజన్ రెడ్డి. ఈ విషయం తెలిసిన లోక్‌నాథ్ తన పవర్ కూడా చూపించాలని ప్రయత్నం చేశారు.
గత నెల ఏడవ తేదీన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం ఉంటుందని.. అందరూ హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. మంత్రికి కూడా ఆహ్వానం పంపారు. గతంలో మంత్రి అనుమతితో ఈ సమావేశం నిర్వహించేవారు. అయితే ఈ సారి సమాచారం మాత్రమే ఇచ్చారు లోక్‌నాథ్. ఈ క్రమంలోనే సమావేశం ఏర్పాటు చేయగా…జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, అధికారులు పోగా.. కొద్ది మంది మాత్రమే నేతలు హాజరయ్యారు. జిల్లాలోని ఎంపీపీలకు..జెడ్పీటీసీలకు మంత్రి నుంచి డైరెక్షన్లు వెళ్లడంతో అందరూ డుమ్మా కొట్టారు. సరైన కోరం రాకపోవడంతో.. సమావేశాన్ని వాయిదా వేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న లోక్‌నాథ్ మంత్రిని మరో రూట్‌లో దెబ్బ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈక్రమంలో ఆయన కొంతకాలంగా బీజేపీ జపం చేస్తున్నారు. టీఆర్ఎస్ చేస్తున్న పనులు, కార్యక్రమాల గురించి మాట్లాడకుండా.. బీజేపీ గురించి పొగుడుతూ..చర్చలు మొదలు పెట్టారు..దాంతో చాలా మంది కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మంత్రికి ఇవన్నీ చేరవేయడంతో..ఇపుడు పూర్తిగా ఇద్దరి మద్యన అగాథం ఏర్పడింది.
లోక్ నాథ్ రెడ్డి తనకు బీజేపీ పెద్దలు టచ్ లో ఉన్నారన్న సంకేతాలు ఇస్తున్నారు. దాంతో టిఆర్ఎస్ పార్టీలో కొంత అస్థిరత్వం వస్తుందని అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి లోక్ నాథ్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉంటారని, టీఆర్ఎస్ క్యాడర్‌లో కొంత చీలిక రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా తాజా పరిణామాలు జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీసాయి.