బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు, అబ్బాయిల ప్రవర్తన కాస్త అయోమయంగానే ఉంటుంది. శారీరక పరివర్తనకు తగ్గట్టుగా మానసిక పరివర్తన సర్దుబాటు కాని సంధికాలమది. ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాలతో కలగలసిన నిలకడ లేని దశ. క్షణ క్షణానికీ ఆలోచనలు మారిపోతుంటాయి. కొత్త నమ్మకాలు,భయాలు పుట్టుకొస్తుంటాయి.
సడన్ గా ఈ వయసు వ్యాసం ఏంటనుకుంటున్నారా. అమ్మాయిలను చూసి ఫ్లాట్ అవ్వాల్సిన 17 ఏళ్ళ ఇంటర్ విద్యార్థి.. స్ఫృహతప్పి పడిపోయాడు. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని నలందా జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. మనీశ్ శంకర్ ప్రసాద్ అనే 17 ఏళ్ల విద్యార్థి అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.
షెడ్యూల్ ప్రకారం బుధవారం గణితం పరీక్ష ఉంది. దీంతో మనీశ్‌ను పరీక్ష హాల్ వద్దకు అతని తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తీసుకెళ్లాడు ఈ క్రమంలో ఎగ్జామ్‌కు టైం అవుతుండగా మనీశ్ పరీక్ష హాల్లోకి వెళ్లారు.
అయితే, అక్కడ మొత్తం అమ్మాయిలే ఉండటంతో వారిని చూసి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. గమనించిన పాఠశాల యాజమాన్యం మనీశ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ఆ పరీక్షహాల్లో 50 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి మధ్య శంకర్ ప్రసాద్ ఒక్కడే అబ్బాయి కావడంతో కంగారు పడి కుప్పకూలిపోయినట్టు ఆయన తండ్రి సచ్చిదానంద ప్రసాద్ తెలిపారు.
చికిత్స అనంతరం కొన్ని గంటల తర్వాత మనీశ్ కోలుకున్నట్టు చెప్పారు. ఇది నిజంగా గర్ల్స్ భయమేనా..లేక, గణిత భయమా !? అర్థంకాని డైలమాలో ఉన్నారట సహవిద్యార్థులు.