కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ స్పీచ్ ను ట్రాన్స్ లేట్ చేయడానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతుంటారు. కొంత మంది చాలా ఉత్సాహంతో ట్రాన్స్ లేట్ చేయడానికి ముందుకొచ్చినా ఆ తర్వాత నానా తంటాలు పడుతూ ఇటు రాహుల్…అటు ప్రజల ఆగ్రహానికి గురవుతుంటారు. కానీ కేరళలో ఓ పన్నెండేళ్ల స్టూడెంట్ రాహుల్ గాంధీ ఇంగ్లీష్ ప్రసంగాన్ని మలయాళంలోకి ట్రాన్స్ లేట్ చేసి శభాష్ అనిపించుకుంది.
కేరళలోని రాహుల్ సొంత పార్లమెంట్ నియోజకవర్గం వయనాడులో రాహుల్ గాంధీ ఓ స్కూల్ సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. తన స్పీచ్ ను ఇంగ్లీష్ నుంచి మలయాళంలోకి ఎవరైనా ట్రాన్స్ లేట్ చేస్తారా అని అడిగారు. రెగ్యులర్ గా రాహుల్ స్పీచ్ ను ట్రాన్స్ లేట్ చేసే కె.సి.వేణుగోపాల్ పక్కనే కూర్చొని చిరునవ్వు నవ్వుతున్నారు. ఇంతలో గవర్నమెంట్ స్కూల్లో చదివే సఫా సెబిన్ అనే 12 వ తరగతి విద్యార్ధిని ముందుకొచ్చింది. చాలా విశ్వాసంతో ట్రాన్స్ లేట్ చేయడానికి ముందుకొచ్చిన సెబినా కు తోటి విద్యార్ధులు పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగతం పలికారు.
స్టేజ్ మీదకు వస్తూ వస్తూనే నమస్తే అంటూ రాహూల్ కు నమస్కరించారు. ప్రతిగా రాహుల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత సైన్స్ గురించి రాహుల్ చెప్పిన విషయాలను ఏ మాత్రం తడబడకుండా, చాలా సులభంగా మలయాళంలోకి తర్జుమా చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది.