భారత్ కొత్త సవాల్ ఎదుర్కోబోతోందా? భవిష్యత్‌లో దేశం మరింత వేడెక్కడం ఖాయం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. The Intergovernmental Panel on Climate Change విడుదల చేసిన 6వ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రానున్న కాలంలో దేశం తరచూ అత్యత తీవ్రమైన వేడిగాలులతో ఇబ్బందులు పడుతుందని తమ నివేదికలో అంచనా వేసింది. మానవుల కారణంగా రానున్న రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయనే దానిపై సమగ్ర నివేదికను IPCC అందించింది. అయితే వేడి గాలుల తీవ్రతే కాదు.. కాలంతో సంబంధం లేకుండా అతివృష్టి సంభవించొచ్చని హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రాలతో పోలిస్తే.. హిందూ మహాసముద్రం అత్యంత వేగంగా వేడెక్కుతోందని IPCC తమ నివేదికలో చెప్పుకొచ్చింది. పారిశ్రామికీకరణ ముందు కాలం ( 1850-1900 ) కంటే 2 ° C కంటే అధికంగా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయిందని.. ఫలితంగా మడ అడవులు, కెల్ప్ అడవులు, రాతి తీరాలు, పగడపు దిబ్బలతో పాటు సముద్రానికి సంబంధించి పర్యావరణ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అందులో వివరించింది. తీరప్రాంతం వెనక్కి వెళ్లిందని తెలిపింది. అంతేకాదు దేశంలో చలి తీవ్రత ఎంతలా తగ్గుతుందో.. వేడి తీవ్రతలు అంతలా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్త0 చేసింది. ఈ ధోరణి రాబోయే దశాబ్దాల్లో కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారతదేశం అత్యంత వాతావరణ-హాని కలిగించే దేశాలలో ఒకటిగా ఉందని గుర్తు చేసిన IPCC.. జాగ్రత్తపడకపోతే రానున్న కాలంలో.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. అలా జరగకూడదంటే.. ప్రభుత్వంతో పాటు దేశ పౌరులు కూడా వాతావరణ-స్థితిస్థాపకత కోసం ప్రయత్నం చేయాల్సి అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. రాబోయే 20 సంవత్సరాలలో గ్లోబల్ టెంపరేచర్ 1.5 ° C వేడెక్కే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. వేడి, కాలుష్య ఉద్గరాలను తగ్గించకపోతే.. ఈ తీవ్రత 2.0 ° C వరకు పెరిగే అవకాశముందని పర్యారణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.