హిందూ మతంలో రాయి,రప్ప,చెట్టు,పుట్టా ఇలా ప్రతిదాన్ని పూజిస్తూ ఉంటారు. వాళ్ళు పూజించేది రాయిని మాత్రం కాదు,రాయిలో వారు చూడగలుగుతున్న దేవుణ్ణననేది వారి విశ్వాసం. అయితే ఒక్కో గ్రామంలో ఒక్కో దేవత లేదా దేవుడు ప్రత్యేకం. ఆయా దేవీ,దేవతల పూజా విధానాలు కూడా ప్రత్యేకం.
ఏ దేవుడికైనా, దేవతకైనా పూలు, పళ్ళు,కొబ్బరి కాయలు పసుపు కుంకుమ లాంటివి సమర్పిస్తుంటారు. కానీ గడియారాలు కానుకగా ఇస్తే స్వీకరించే దేవుడిని ఎక్కడైనా చూసారా, అగరబత్తిలాగ సిగరెట్ వెలిగించి మొక్కుకుంటే కోరికలు తీర్చే దేవుణ్ణి ఎక్కడైనా చూసారా.
మధ్యప్రదేశ్లోని సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయంలో ఇలా విచిత్రంగా పూజలు చేస్తున్నారు భక్తులు. ఉజ్జయిని జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో అన్హెల్ రోడ్డు పక్కన ఉందీ ఆలయం. ఓ మర్రి చెట్టు కింద ఈ సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయం ఉంది.
కోరుకున్న కోరికలు తీరిన అనంతరం.. భక్తులు ఈ గుడికి వచ్చి గడియారాలను ఘడి వాలే బాబా సమర్పిస్తారు. దీంతో ఆ రావి చెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది. ప్రస్తుతం ఈ చెట్టుకు దాదాపు 2వేల గడియారాలు వేలాడదీసి ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా టిక్ టిక్ అనే శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి.
నేను రెండు గడియారాలు తీసుకుని వచ్చాను. దేవున్ని కోరిక కోరుకుని తరువాత వాటిని మర్రి చెట్టుకు కట్టాను. మొదట దేవుడికి కొబ్బరికాయ కొట్టాను. అగరబత్తులు వెలిగించి, సిగరెట్ కాల్చి మొక్కులు చెల్లించానని చెప్పుకొచ్చాడు ఓ భక్తుడు.
టైం బాగాలేని వారు ఇక్కడికి వచ్చి గడియాలు దేవుడికి సమర్పిస్తే వారు బాధలు తొలగిపోతాయని నమ్మకమట. ఈ గుడిలో పూజారుటంటూ ఎవరూ ఉండరు, భక్తులే పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారట. ముందుగా కొబ్బరి కాయలు కొట్టి, అగరబత్తులు వెలిగిస్తారు.
అనంతరం ఓ సిగరెట్ కాల్చి ఘడి వాలే బాబా ముందు కోరికలు కోరుకుంటారు. గత పదేళ్లుగా ఈ గుళ్లో ఈ తరహా పూజలు జరుగుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. రెండేళ్ల నుంచి ఈ గుడికి భక్తులు ఎక్కువగా వస్తున్నట్లు వారు తెలిపారు.
ఈ గుడికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా.. వంద కిలో మీటర్ల అవతల నుంచి కూడా భక్తులు వస్తున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. పౌర్ణమి, ఆదివారం రోజుల్లో సాగస్ మహారాజ్ ఘడి వాలే బాబా ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారని వారు చెబుతున్నారు.