– వెంకట్ రెడ్డి ఇంటికి వెళ్లిన భట్టి
– పాదయాత్రకు మద్దతు తెలపాలని వినతి
– మీ వెంటే ఉంటానన్న కోమటిరెడ్డి
కాంగ్రెస్ లో వర్గ విభేదాలకు కొదవే లేదు. ఎప్పుడు ఎవరు గొడవ పడతారో ఎవరికీ తెలియదు. ఈమధ్యే కమిటీల విషయంలో పెద్ద రచ్చ జరిగింది. ఒరిజినల్ కాంగ్రెస్, వలస నేతల కాంగ్రెస్ అంటూ వర్గాలుగా విడిపోయి నేతలు తిట్టుకున్న పరిస్థితి. ఈ క్రమంలోనే రాష్ట్ర ఇంఛార్జ్ సైతం మారాల్సి వచ్చింది. తర్వాత మాణిక్ రావు ఎంట్రీతో అంతా సద్దుమణిగింది. కానీ, పార్టీలో వర్గపోరు కొనసాగుతూనే ఉంది.
ప్రస్తుతం టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను ఆయన కవర్ చేశారు. అయితే.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్రకు సిద్ధమయ్యారు. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే.. రేవంత్ అంటే పడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన కలవడం హాట్ టాపిక్ గా మారింది.
బంజారాహిల్స్ లోని కోమటిరెడ్డి నివాసానికి వెళ్లారు భట్టి. ఇద్దరు కాసేపు చర్చలు జరిపారు. తన పాదయాత్రలో పాల్గొనాలని భట్టి కోరారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. నెల 16 నుండి ప్రారంభమయ్యే తన పాదయాత్రలో కోమటిరెడ్డి కూడా పాల్గొంటారని స్పష్టం చేశారు భట్టి. యాత్రకు సంబంధించిన కొన్ని సూచనలు చేశారని చెప్పారు. పీసీసీ చీఫ్ పాదయాత్ర వేరే రూట్ లో ఉందని, తన పాదయాత్ర మరో రూట్ లో వెళుతుందని భట్టి తెలిపారు. 60 శాతం టిక్కెట్లు కన్ఫాం అయ్యాయన్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు.
ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తాము అత్యంత దగ్గరి నుండి చూసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు కోమటిరెడ్డి. ఎండలు బాగా ఉన్న సమయంలో భట్టి విక్రమార్క పాదయాత్ర సాగనుందదన్నారు. మంచిర్యాల, జడ్చర్ల, షాద్ నగర్ లలో సభలు పెట్టాలని తాను సూచించినట్టుగా చెప్పారు. అలాగే, నకిరేకల్, సూర్యాపేటలలో మినీ పబ్లిక్ మీటింగ్ లు పెట్టాలని కోరానన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున శని, ఆదివారాల్లో మాత్రమే పాదయాత్రలో పాల్గొంటానని వెంకట్ రెడ్డి చెప్పారు.