హైదరాబాద్: హుజూర్ నగర్‌లో కాంగ్రెస్‌దే గెలుపని ధీమాగా చెబుతున్నారు సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క. హుజూర్ నగర్ అభ్యర్థిని త్వరలోనే పార్టీ ప్రకటిస్తుందని ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రశ్నించే ప్రతిపక్ష అవసరమని అంటూ, ప్రజాస్వామ్యవాదులు హుజూర్ నగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపిస్తారని జోస్యం చెప్పారు. ఈ గెలుపు కాంగ్రెస్‌కు, ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని అన్నారు. హుజూర్ నగర్ ప్రచారంలో ప్రతి ఒక్కరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ‘తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసి హుజూర్ నగర్‌లో గెలవాలని చూస్తోంది. హుజూర్ నగర్‌లో స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం. కొందరు అధికారులు ఏకపక్షంగా పనిచేస్తున్నారు. వారు తమ వైఖరిని మార్చుకోవాలి. హుజూర్ నగర్‌లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సింహంలా పనిచేసి గెలుపు సాధించాలి. టీఆరెస్‌లో ఓనర్లకు, కిరాయిదారులకు గొడవ నడుస్తోంది. ఉద్యమకారులను టీఆరెస్ వాడుకుని వదిలేస్తుంది. అది రాష్ట్రంలో ప్రతిఒక్కరికి తెలుసు..’ అని భట్టీ అన్నారు.