టానిక్ అంటే ఏదో రోగాలు తగ్గడానికి ఇచ్చే మందు అనుకోకండి. టానిక్ అంటే తాగుబోతులు తాగే మందు షాప్ పేరు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క టానిక్ అనే వైన్ షాప్‌కు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారు అని మాట్లాడారు. అసలు ఈ టానిక్ ఎవరిది? ఎందుకు దానికి అంత ప్రాముఖ్యత…?.
ఒక్క వైన్ షాప్ పెట్టుకోవాలీ అంటే టెండర్‌లో పాల్గొనాల్సి ఉంటది. టెండర్‌లో వస్తే కానీ వైన్ షాప్ పెట్టుకోవడానికి అనుమతి రాదు. కానీ టానిక్ అనే వైన్ షాప్‌కు మాత్రం స్పెషల్ జీఓ ద్వారా 12 షాప్‌లకు అనుమతులు ఇచ్చారు. ఇది మామూలు వైన్ షాప్ కూడా కాదు, అక్కడ విదేశీ మద్యం ఒక్కో బాటిల్ 2లక్షలకు పైగా ఉంటుంది. ఏషియాలోనే టానిక్ అతి పెద్ద వైన్ షాప్. తెలంగాణలో టానిక్ వైన్ షాప్‌లకు ఎలాంటి నిబంధనలు వర్తించవు, ఎందుకంటే ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులకు సంబంధించినదే టానిక్ వైన్ షాప్. కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్‌కు సన్నిహితుడైన బెంగుళూర్ వాసి అమిత్.. ఈ ముగ్గురూ ఈ టానిక్‌లో భాగస్వాములని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సభలో మాత్రం భట్టి టానిక్ ఎవరిది అని ప్రశ్నించారే తప్ప కేటీఆర్ సహా ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే భట్టి సభలో కేటీఆర్ పేరు చెప్పడానికి భయపడ్డారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. కేటీఆర్‌కు సంబంధించింది కాబట్టే స్పీకర్ వెంటనే మైక్ కట్ చేశారు. టానిక్ వైన్ షాప్ కేటీఆర్‌ది కాబట్టే అడ్డగోలు అనుమతులు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు.. ప్రభుత్వం తలుచుకుంటే అనుమతులకు అడ్డమా అంటున్నారు ఇతర వైన్ షాప్ యజమానులు.