సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మోతేలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రశాంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ గ్రామంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. కాసులకు కక్కుర్తి పడిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఖద్దర్ బాబుల బీరువాలు కాసులతో కళకళలాడుతున్నాయి.
రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఇసుక దందాను పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు పక్కదారి పడుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా ఉంటున్నారు. వాగుల్లో అనుమతి లేకుండా ఇసుక తవ్వడం చట్ట వ్యతిరేకం. ఏ అవసరానికైనా కావాలంటే అనుమతి తప్పనిసరి. అయితే ఇందుకు విరుద్ధంగా మోతే వాగులో నుంచి ఇసుకను తవ్వేస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
కళ్ల ముందే ఇంత అక్రమ వ్యాపారం జరుగుతున్నా స్థానిక తహశీల్దార్ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు స్థానికులు.