రాజస్థాన్‌లో గతేడాది తలెత్తిన రాజకీయ సంక్షోభం సందర్భంగా సీఎంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమేనని తాజాగా అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. దీంతో సీఎం అశోక్ గెహ్లాట్‌పై రాజస్థాన్ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.
కేవలం తన కుర్చీ కాపాడుకోవటానికి ఆయన అన్ని పరిమితులు దాటారని, అడ్డదారులు తొక్కారంటూ మండిపడింది. ఓ కేంద్రమంత్రికి, రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు బయటకు రావటంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత గెహ్లాట్ సర్కార్ ట్యాపింగ్ ఆరోపణలను అంగీకరించింది.
ఏ చట్టం ప్రకారం ఈ ట్యాపింగ్ చేశారని బీజేపీ ప్రశ్నించగా… భారత టెలీగ్రాఫ్ చట్టం-1885 ప్రకారం చేశామని, ప్రజా ప్రయోజనార్థం… ప్రజల భద్రత కోసం చేశామంటూ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
దీనిపై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టి… సొంతపార్టీ నేతలపైనే గెహ్లాట్ నిఘా ఉంచారని, గాంధేయవాదం ముసుగులో మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ మండిపడ్డారు.