ఛత్తీస్‌గడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ కోశాధికారి నివాసాల్లో ఈడీ దాడులు చేస్తోంది. మొత్తం రాష్ట్రంలో 14 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ సన్నిహితులే టార్గెట్‌గా ఈ దాడులు జరిగినట్టు సమాచారం. కోల్ లెవీలో కొందరు రాజకీయ నేతలు, అధికారులు రూ. 540 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ సంచలన ఆరోపణలు చేసింది.
ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం భూపేష్ బాగేల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. కోల్ లెవీ కుంభకోణంలో నిధులను ఖైరాఘడ్ ఉపఎన్నికకు వినియోగించారని ఈడీ ఆరోపించిందన్నారు. ఓ వైపు భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం, మరోవైపు అదానీకి సంబంధించిన నిజాలు బయటకు రావడంతో బీజేపీ నిరుత్సాహానికి గురైందన్నారు.
అందుకే ఇప్పుడు ఈడీ దాడులతో ప్రజల దృష్టి మరల్చేందుకు బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశ ప్రజలకు నిజం తెలుసని చెప్పారు. ఈ విషయంలో తాము పోరాడి గెలుస్తామని ఆయన ట్వీట్ చేశారు.