పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ బంపరాఫర్ ఇచ్చారు. బోర్డు పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి మంచి అద్భుతమైన గిఫ్ట్ ను ప్రకటించారు.
బోర్డు పరీక్షల్లో టాప్-10 స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు హెలికాప్టర్ లో ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
బలరాంపూర్ జిల్లాలోని రాజ్‌పూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు హెలికాప్టర్ లో ప్రయాణించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
హెలికాప్టర్ లో ప్రయాణించాలని అందరూ అనుకుంటారనీ పేర్కొన్నారు. జీవిత గగనతలంలో ఎగరాలనే కోరికను విద్యార్థుల్లో ఈ రైడ్ కలిగిస్తుందన్నారు. దీంతో విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇది తోడ్పడుతుందన్నారు.