ఏపీ ఎఫెక్ట్.. పార్లమెంట్ నిరవధిక వాయిదా?

పార్లమెంట్ సమావేశాలను గమనిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకహోదా విషయంలో ఆందోళనను తీవ్రతరం చేయాలని ఎంపీలను ఆదేశించారు. పరిస్థితులను గమనిస్తున్న బీజేపీ.. ఆర్థిక బిల్లులు హడావుడిగా పూర్తిచేసి.. పార్లమెంటు నిరవధిక వాయిదా వేయొచ్చని, ఆర్థిక బిల్లులపై చర్చలో ఏపీకి ప్రత్యేకహోదా, ఆర్థిక లోటుపై చర్చించాలని సూచించారు. సభకు ఎవరు గైర్హాజరు కారాదని, ప్రజల గొంతు సభల్లో ప్రతిధ్వనించాలని నేతలకు వివరించారు. మరోవైపు సభ్యుల ఆందోళన మధ్య ద్రవ్య వినిమయ బిల్లు సవరణలను ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రతిపాదించగా సభ ఆమోదం తెలిపింది. స్టాండింగ్‌ కమిటీ ప్రతిపాదనలకూ సభ ఆమోదముద్ర వేసింది.

టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడంపై సీఎం తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రపక్షం ఎంపీలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా వైసీపీ ఎంపీకి ఇవ్వడం ఏమిటని నిలదీశారు. ఇంతకీ బీజేపీకి మిత్రపక్షం వైసీపీనా? టీడీపీనా? అని వ్యాఖ్యానించారు. ఏపీ సమస్యలపై కేంద్రం స్పందించకపోవడం అన్యాయమని, దశలవారీగా పోరాటం ఉధృతం చేయాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.