ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ స్టార్స్ భేటీ ముగిసింది. అనంతరం మీడియా ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ త్వరలోనే శుభవార్త రాబోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మీడియా ముందుకు ముఖ్యమంత్రి జగన్ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని క్రియేట్ చేద్దామని చూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తో పోటీ పడే సత్తా విశాఖకు ఉందని అన్నారు. కనీసం 20 శాతం షూటింగ్ లను ఏపీలో చేయాలని చెప్పినట్లు జగన్ చెప్పారు. విశాఖ మనది అనుకునే భావించాలని అన్నారు. 100 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే ప్రత్యేక రాయితీ ఉంటుందని తెలిపారు.
ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా ఒకటే రేటు ఉంటుందని… సీఎం జగన్ అన్నారు. దీని కోసం కార్యాచరణ చేసుకోవాలని కోరుతున్నానని తెలిపారు. విశాఖలో స్టూడియోలకు స్థలాలు కూడా ఇస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణ తో 40% ఆదాయం వస్తే 60 శాతం ఆదాయం ఇండస్ట్రీకి ఏపీ నుంచి ఉందని జగన్ చెప్పుకొచ్చారు.
నిర్మాతలకు నష్టం లేకుండా ప్రేక్షకులకు భారం కాకుండా సినిమా టికెట్ ధరలు ఉంటాయని ప్రకటించారు. సినిమా టికెట్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటామని అందరికీ ప్రయోజనం జరిగేలా న్యాయం జరిగేలా రేట్లు ఉంటాయన్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయని అన్నారు జగన్.