గోదావరి పడవ మునక విషాద ఘటన ఏరియల్ సర్వేలో సీఎం, మంత్రులు సీరియస్‌గా పరిస్థితిని పరిశీలిస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు కాకుండా వారు చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఆయన సాధారణమైన రాజకీయ నాయకుడు కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన అడుగు తీసి అడుగు వేస్తే వేయి కళ్లు పరిశీలిస్తాయి. ప్రజలు, ప్రతిపక్షాల ఫోకస్ ఎప్పుడూ ఆయన మీదే వుంటుంది. అత్యున్నత స్థానంలో వున్న అటువంటి వ్యక్తి ఒక విషాద సమయంలో బాధితుల పరామర్శకు వెళ్తుంటే ఎంత అప్రమత్తంగా వుండాలి..? అందులోనూ మీడియా రిలేషన్స్ చూసే వాళ్లు మరెంత కేర్‌ఫుల్‌గా ఉండాలి..?
సీయంవోలో ప్రజా వ్యవహారాలు చూసే ఇద్దరు క్యాబినెట్ స్థాయి సలహాదారులు, సీఎంవోకు ప్రత్యేకంగా ఒక సీపీఆర్‌వో, వారి కింద మరో ఏడుగురు మీడియా సంబంధాల అధికారులు, వీరు గాకుండా ఢిల్లీలో మరో క్యాబినెట్ ర్యాంక్ సలహాదారు, మళ్లీ అక్కడ మీడియా బాధ్యతలకు ఒక ఓఎస్‌డీ.. ఇలా ఇంతమంది ప్రస్తుత ముఖ్యమంత్రి మీడియా వ్యవహారాలు చూస్తుంటారు. వీరందరూ సాక్షి నుంచి తీసుకున్న మీడియా సైన్యమైతే, ప్రభుత్వం తరపున సమాచార-పౌర సంబంధాల శాఖ రెగ్యులర్ ఉద్యోగ సిబ్బంది మరెందరో వుంటారు. ఇంతమంది వుండి, ఇన్ని అంచెలలో పర్యవేక్షణ వుండీ గోదావరి పడవ ప్రమాద బాధితుల్ని చూడ్డానికి వెళుతున్న ముఖ్యమంత్రి, మరో ఇద్దరు మంత్రులు నవ్వుతూ వున్న ఫోటోలు తీసి పత్రికలకు పంపిస్తారా..? ఇవి ప్రజల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి పరువు ఏంగాను..? సమయం.. సందర్భాలు చూసి సరైన ఎంపిక చేసిన ఫోటోలు మీడియాకు ఇవ్వాలి కానీ, ఇవేం ఫోటోలు మహాశయా..? సీఎం జగన్, మంత్రులు అనిల్, సుచరిత హెలీకాఫ్టర్‌లో బోటు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని, సహాయ చర్యల్ని ఏరియల్ సర్వే చేసిన సందర్భంలో తీసిన ఈ ఫోటోలు విమర్శలకు తావిచ్చే విధంగా చెక్ చేసుకోకుండా మీడియాకు రిలీజ్ చేసిన సంబంధిత బాధ్యులెవ్వరు..? ఏం జరుగుతోంది అక్కడ..? అని అంటున్నారు మీడియా వాళ్లు.