ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. హిందూ దేవాలయాలపై దాడులతో రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒక్కసారిగా వాయిస్ పెంచేశాయి. వరుసగా పర్యటనలు, యాత్రలు చేపడుతున్నాయి. దీంతో అధికారంలో ఉన్న వైసీపీ ఇరకాటంలో పడింది. పైగా బీజేపీ ఇంకాస్త వాయిస్ పెంచి బైబిల్ పార్టీ కావాలా? భగవద్గీత పార్టీ కావాలా? అంటూ దాడిని పెంచటంతో సీఎం జగన్ విరుగుడు మంత్రం జపిస్తున్నారు.
కనుమ రోజు రాష్ట్రవ్యాప్తంగా గోపూజ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. రాష్ట్రంలోని 2679 దేవాలయాల్లో ఈ గోపూజను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. సీఎం జగన్ స్వయంగా పట్టుబట్టలతో, నుదుట బొట్టుతో నరసారావుపేట మున్సిపల్ స్టేడియంలో గోపూజ చేశారు.
సీఎం జగన్ తీసుకున్న చర్యలు బైబిల్ పార్టీ వైసీపీ అని, జగన్ క్రైస్తవ మతస్థుడని, హిందువులను అణిచే పాలన సాగుతుందన్న ప్రచారానికి చెక్ పెట్టేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా బీజేపీని, మతరాజకీయం ద్వారా తిరిగి ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్న టీడీపీని ఏకకాలంలో వాయిస్ లేకుండా చేసే ఎత్తుగడ అని అంటున్నారు. మత రాజకీయంతో తిరుపతి ఉప ఎన్నికకు సన్నద్దం అవ్వాలనుకున్న పార్టీలకు జగన్ విరుగుడు మంత్రం వేస్తున్నారని, ఇది ఎలా పనిచేస్తుందో వేచి చూడాలని కామెంట్ చేస్తున్నారు.