చదువు అనేది గొప్ప ఆస్తి.. ఎవరూ దొంగిలించలేని ఆస్తి అని సీఎం జగన అన్నారు. తలరాతలు మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. గురువారం సీఎం జగన్ 10.85 లక్షల మంది పిల్లలకు విద్యాదీవెన ద్వారా వారి తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. తిరుపతి తారకరామ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అక్కచెల్లెమ్మలను, విద్యార్థులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.
పెద్ద చదువులు మనిషి చరిత్రను, కుటుంబ చరిత్రను, సామాజిక వర్గ చరిత్రను, రాష్ట్ర చరిత్రను, దేశ చరిత్రను మారుస్తుందని సీఎం జగన్ అన్నారు. నాన్నగారి హయాంలో పూర్తి ధ్యాస చదువుపైనే పెట్టారని, పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అందిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తర్వాత దీన్ని ఒక్కరు కూడా అమలు చేయలేదని అన్నారు. చక్కటి మార్పులు చేసి, చదువుల విప్లవాన్ని తీసుకు వచ్చామని ఆయన వెల్లడించారు.
పిల్లలను చదివించుకోలేని, ఫీజులు కట్టకోలేకపోతున్న తల్లిదండ్రుల క్షోభను తాను కళ్లారా చూశానని సీఎం జగన్ చెప్పారు. ఫీజులకోసం తల్లిదండ్రులు అప్పులు పాలైన ఘటనలు చూశానని, ఇలాంటి కష్టాలు చూసి పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా తాను చూసినట్లు చెప్పారు. ఇలాంటివి పునరావృతం కాకూడదని వంద శాతం పూర్తి ఫీజురియింబర్స్‌మెంట్ వరుసగా మూడేళ్లపాటు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఫీజు రియింబర్స్‌మెంట్‌ను ప్రతి త్రైమాసికానికి చెల్లిస్తున్నామని, తల్లుల ఖాతాల్లో వేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. జనవరి–మార్చి త్రైమాసికానికి సంబంధించి ఇప్పుడు డబ్బులు వేస్తున్నామని, 10.85లక్షల విద్యార్థులకు 9.75 లక్షల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు వేసినట్లు ఆయన పేర్కొన్నారు.