అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం హైదరాబాద్ సీబీఐ కోర్టుకు హజరుకావటం సీఎం జగన్‌కు తప్పనిసరి. కానీ ఏవేవో కారణాలు చూపుతూ కొంతకాలంగా శుక్రవారం కోర్టుకు డుమ్మా కొడుతున్నారు సీఎం జగన్. దీంతో సీబీఐ అభ్యంతరం చెప్పటం, అధికారిక కార్యక్రమాల సాకుతో జగన్ కోర్టుకు రావటం లేదన్న కారణంతో ఈ శుక్రవారం అంటే జనవరి 10న జగన్, విజయసాయి రెడ్డి కోర్టుకు రావాల్సిందేనంటూ సీబీఐ కోర్టు ఆదేశించింది. అయితే ఇప్పుడు జగన్, విజయసాయితో పాటు ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా కోర్టు మెట్లు ఎక్కాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిలు మాత్రమే ఉంటే… విజయమ్మ, షర్మిల ఎందుకు హజరుకావటం అంటే, జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సందర్భంలో జగన్‌కు మద్దతుగా కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసి నాటి మంత్రి కొండా సురేఖ మంత్రి పదవికి, తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాంతో పరకాలలో ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు విజయమ్మ, షర్మిలతో పాటు కొండా సురేఖ, కొండా మురళిలు ప్రచారం చేశారు. 2012 జూన్ 8న పరకాలల ఎలాంటి అనుమతులు తీసుకోకుండా సభ నిర్వహించారని అప్పట్లో కేసు నమోదు కాగా… ఈ కేసులో అందరికీ సమన్లు జారీ చేసిన కోర్టు, ఈ నెల 10న కోర్టుకు రావాల్సిందేనని ఆదేశించింది.
ఓవైపు జగన్ సీబీఐ కోర్టు ఆదేశాలను పాటిస్తారా అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు వెళ్లాల్సి రావటంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది. జనవరి 10న కోర్టు డే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.