ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సచివాలయాలకు సంబంధించి మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓఆర్జీ పరిష్కారానికి సంబంధించి తగు సౌకర్యాలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. దరఖాస్తుదారుడికి ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో తెలియజేసే ప్రక్రియను తీసుకొచ్చింది. గురువారం ఏపీ సేవ పోర్టల్ ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం జగన్.
మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపారు జగన్. సచివాలయాల్లో అందించే సేవలను మరింత మెరుగు పరిచేవిధంగా ముందడుగు వేస్తూ 2.0ను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు.
మొత్తం 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోందని వివరించారు జగన్. మీ సేవా కేంద్రాలలో సైతం అందుబాటులో లేని 220కి పైగా కొత్త సేవలు సచివాలయాల్లో ఉంటాయని స్పష్టం చేశారు. గడిచిన ఏడాదిలో 3.47 కోట్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు అందాయని తెలిపారు.
సచివాలయాల ద్వారా పొందుతున్న సేవలలో 90 శాతం కొత్త సాఫ్ట్ వేర్ పోర్టల్ కు అనుసంధానించే ప్రక్రియ పూర్తి చేశారు అధికారులు. 135 సేవలను కొత్త పోర్టల్ కు అనుసంధానించి గత 20 రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు