సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హజరు నుండి మినహయింపు ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో ఎట్టకేలకు సీబీఐ కోర్టుకు హజరుకాబోతున్నారు. ఎప్పట్లాగే అధికారిక షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ… వ్యక్తిగత హజరు నుండి మినహయింపు పిటిషన్‌ను జగన్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా హజరవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
తాను సీఎంగా ఉన్నందున అధికారిక కార్యక్రమాల్లో ఏపీలో బిజీగా ఉండాల్సి వస్తుందని, వ్యక్తిగతంగా తనకు హజరు నుండి మినహయింపు ఇవ్వాలని… ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతరులు కోర్టుకు హజరవుతారని సీబీఐ విచారణ, ఈడీ కేసులో జగన్ అనేకసార్లు పిటిషన్ వేసుకోగా సీబీఐ కోర్టులు పిటిషన్‌ను కొట్టి వేశాయి. అంతేకాదు పదే పదే అబ్సెంట్ పిటిషన్ వేయటం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుందంటూ ఖచ్చితంగా హజరవ్వాల్సిందేనని స్పష్టం చేశాయి.
అయితే, ఈడీ కోర్టులో హజరుపై మినహయింపు రాకపోవటంతో… జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో సీబీఐ కోర్టు ఖచ్చితంగా హజరు కావాల్సిందేనని చెప్పినా… హైకోర్టులో విచారణ కొనసాగుతున్నందున కోర్టుకు రాలేదు. కానీ అనూహ్యంగా జగన్ తరుపు లాయర్లు హైకోర్టు నుండి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఏదో లాజిక్ ఉందని అంతా భావించినా… పిటిషన్‌లో చిన్న పొరపాటు ఉందని, సరిచేసి మళ్లీ పిటిషన్ వేస్తామని జగన్ తరపు లాయర్లు చెప్పినా… మళ్లీ పిటిషన్ వేయలేదు.
దీంతో… జగన్ ఈసారి కోర్టుకు రావటం అనివార్యమైంది.