మనల్ని కాదనుకున్నోళ్లు మన గుమ్మం తొక్కటానికి వీల్లేదు. మనకు ఎదురుతిరిగినవాడి మొహమే చూడనక్కర్లేదు. బ్లాక్ బస్టర్ లాంటి విజయం అందుకున్నాక, ఇంతమంది నా వెనక ఉన్నాక.. అసలు బరిలో సరైన ప్రత్యర్ధే లేనప్పుడు.. ఎవడిని చూసి భయపడాలి.. ఎందుకు భయపడాలి.. అంటూ జగన్ తన పొలిటికల్ కాలరెగరేసి మరీ అనుకున్నారు.
కాని తన కంటే బ్లాక్ బస్టర్ అందుకున్న మోడీ సంగతి మర్చిపోయారు. ఆయనతోపాటు ఉన్న అమిత్ షా చెరుకుగడ తినిపిస్తూ మరీ వేసే ఎత్తుగడలు గుర్తుకు రాలేదు. కాని ఎవరికేం పదవులు ఇవ్వాలా.. తెలుగుదేశం నాయకులను మళ్లీ లేవకుండా చేయాలంటే ఏం చేయాలా.. అని తెగ మేథోమధనం చేస్తున్న సమయంలోనే… కమలనాథులు గ్రౌండ్ లోకి ఎంటరైపోయారు.
ఆట ఆడటానికి 11 మంది లేరనుకున్నవాళ్లు.. ఏకంగా ఐపీఎల్ లా పది టీములను పోగేసే పనిలో పడ్డారు. అయినా గాని, వాళ్లు లాగేది తెలుగుదేశం వారిని, ఈ దెబ్బకు చంద్రబాబు ఎటూ కోలుకోలేరు… మనకు మంచిదేగా అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కాని అంతలోనే పక్కనే ఉన్న మేధావులు మేలుకొలుపు పాడారు. శత్రువైనా, వీక్ గా ఉన్న చంద్రబాబు ఉండటమే బెటర్.. ఆ కమలంవారు కయ్యానికి వచ్చారంటే మన కాళ్లు విరగడం ఖాయమని హెచ్చరించారు. పైగా మన ప్రాణం ఆ చిలక గూట్లోనే ఉందన్న విషయం కూడా కూసారు.
దీంతో జగన్ కాస్త ఆలోచించినట్లున్నారు.. తన స్టయిల్ మార్చేశారు. బిజెపివాళ్లు ఎవరిని దువ్వుతున్నారో.. వాళ్లను మనమే దువ్వుదాం.. మన గూట్లోకే లాగుదాం. మనమెటూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాలని చెప్పి ఉంటిమి.. కాబట్టి ఎమ్మెల్యే కానోళ్లను లాగుదాం అని డిసైడయ్యారు. మొదట గోదావరి జిల్లా కాపు నాయకుడు తోట త్రిమూర్తులతో ఓపెనింగ్ చేయించారు. అప్పటికే ఒక్కొక్కరిని పావులా కదుపుతున్న కమలనాథులు ఈ పరిణామంతో కాస్త ఖంగు తిన్నారు. దీంతో వారు సైతం స్టయిల్ మార్చేశారు.
దీంతో రాష్ట్రంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల కోసం అటు వైసీపీ, ఇటు బిజెపి ఇద్దరూ ఒక విధంగా యుద్ధం చేస్తున్నారు. వల్లభనేని వంశీతో మొదట బిజెపి తరపున సుజనాచౌదరి మాట్లాడారు. ఆ తర్వాత కొడాలి నాని, పేర్ని నాని వైసీపీ తరపున మాట్లాడటమే కాక.. వంశీకి జగన్ తో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రెండు ఆప్షన్లు కనపడటంతో, వంశీ బార్గెయినింగ్ గట్టిగా చేయడం మొదలెట్టాడు. దాంతో అంతా ఓకె అనుకున్నాక కూడా ముహూర్తం పెట్టకుండా ఇరువైపులా సాగదీస్తున్నారు.
మరోవైపు జగన్మోహన్ రెడ్డి మంత్రి అవంతికి శత్రువైనా గంటాకు సైతం ఇన్విటేషన్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో టీడీపీని క్లీన్ స్వీప్ చేయొచ్చనే ఆలోచనతో పాటు, మరోవైపు బిజెపికి స్కోప్ ఇవ్వకూడదనే ఆలోచనతోనే ఇది చేశారు. కాని అసలే విజన్ ఎక్కువుండే గంటా శ్రీనివాసరావు బిజెపితో చర్చలు మొదలెట్టారు. ఇక్కడ మాత్రం బిజెపియే వైసీపీపై పై చేయి సాధించింది. గంటాతో పాటు కరణం బలరామ్ పేరు కూడా వినపడుతోంది. మరో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే, గంటాకు సన్నిహితుడు కూడా అదేబాటలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సైతం బిజెపిలోకి వెళ్లకుండా జగన్ విఫలయత్నం చేసినట్లు సమాచారం. జేసి కుటుంబంతో కూడా ఇలాంటి బేరసారాలు నడుస్తున్నాయి.
తనకు పడని వాళ్లు, తనంటే పడనివాళ్లను సైతం జగన్ ఆహ్వానిస్తుంటే వైసీపీ నేతలే నోరెళ్లబెడుతున్నారంట. బిజెపి కనుక బలపడితే.. ఇప్పటికి 151 మంది ఉన్నా.. జాతీయపార్టీగా ఆ పార్టీ వ్యూహాల ముందు దెబ్బ తింటామని.. జగన్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. పైగా సీబీఐ కేసులు ఉండనే ఉండాయి. అది కూడా శుక్రవారం రావడం కుదరదంటేనే.. ఇంత బారు ఆరోపణలను సిబీఐ జగన్ పై చేసింది. అసలు ఛార్జిషీట్ల కన్నా ఇదే స్టాంగ్ గా ఉందనే కామెంట్లు కూడా వచ్చాయి. దీంతో మళ్లీ జగన్ జైలుకెళ్లక తప్పదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ సందేహాల నడుమ.. కాస్త అటు ఇటూగా ఆలోచనలో ఉన్నవాళ్లు బిజెపినే ఎంచుకుంటున్నారు. బిజెపి సైతం ఇసుక వ్యవహారం, రివర్స్ టెండరింగ్, రాజధాని, ఇతర అంశాల్లో మొహమాటం కూడా లేకుండా వైసీపిని, జగన్ ని కడిగిపారేస్తోంది. పైగా రాజధాని, రివర్స్ టెండరింగ్ వంటి విషయాల్లో కలగచేసుకోగలిగే అవకాశం ఉన్నా.. కూడా ప్రజా వ్యతిరేకతను జగనే కొనితెచ్చుపెట్టుకుంటుంటే.. అది మనకు లాభమే కదా అని విమర్శలతోనే సరి పెట్టి ఊరుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏమైనా, కమలం జోరు చూసి జగన్ బేజారు అవుతున్నారన్నది మాత్రం వాస్తవం.