ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తీవ్ర సంచలనం రేపిన కోడి కత్తి కేసులో శుక్రవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోడి కత్తి శ్రీనివాస్ కేసులో ఎన్ఐఏ కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టు రావాల్సిందేనని కోర్టు టేప్ రికార్డర్ గా ఉండదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితుడిని నేటి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. దానికి జవాబుగా స్టేట్ మెంట్ రికార్డు చేశామని ఎన్‌ఐఏ న్యాయవాది తెలిపారు. రికార్డు చేస్తే చార్జ్ షీట్ లో ఎందుకు లేదని ధర్మాసనం ప్రశ్నించింది.
బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను.. విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ కూడా కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. ఈనెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది. కోర్టుకు బాధితుడు సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్డి స్పష్టం చేశారు. కాగా కోడి కత్తి కేసులో శ్రీనివాస్‌కు ఎన్ఐఏ కోర్టు బెయిల్ నిరాకరించింది.
కాగా 2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పాదయాత్ర చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్న జగన్ పై శ్రీనివాస్ చేసిన దాడిలో ఆయన భుజానికి గాయమైంది. దీంతో జగన్.. వైజాగ్ లో ఫస్ట్ ఎయిన్ చేయించుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు.
ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఈ కేసును కోర్టు ఎన్ఐఏకు అప్పగించింది. దీంతో ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తుచేస్తోంది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. ఈ కేసులో జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ కోరుతూ అతని కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది.