సీఎంగా జగన్ వచ్చాక 45 రోజుల్లో అన్ని లెక్కలు తేలుస్తాం, సబ్-కమిటీ వేస్తున్నాం అవినీతి బాగోతాలన్నీ బయటపడేస్తాం అంటూ ప్రకటించారు. 5లక్షల కోట్ల అవినీతి కక్కించేస్తాం, పట్టిసీమ అవినీతిపై విచారణ జరిపిస్తాం అంటూ గొప్పగా ప్రకటించారు. 45 రోజులు గడిచి 145 రోజులు వచ్చేశాయి. కానీ సబ్-కమిటీ మీటింగ్ లేదు, అవినీతి చిట్టా లేదు.
గత ప్రభుత్వం కేటాయించిన కాంట్రాక్టులు, చెల్లింపులపై మంత్రుల కమిటీ వేస్తున్నాం. 45 రోజుల్లో అన్నీ అంశాలు నిగ్గు తేలుస్తాం. ప్రతి 15 రోజులకోసారి నేను కూడా సమీక్షిస్తుంటా.. అక్రమాలు నిగ్గు తేల్చి, అవినీతి సొమ్మును రికవరీ చేస్తాం అంటూ సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్నా… ఆ తర్వాత సీఎం జగన్ సైలెంట్ అయిపోయారు. దీంతో సీఎం జగన్ చంద్రబాబును ‘పట్టు’కోలేకపోయారా…? లేదా పట్టించుకోవటం లేదా అన్న చర్చ మొదలైంది.
ఒక్క పోలవరం ప్రాజెక్టుపై మాత్రం నిపుణుల కమిటీ ఆధారంగా విజిలెన్స్ విచారరణకు ఆదేశించారు. అంతే… అమరావతి ప్రాజెక్ట్ అవినీతి గప్ చుప్ అయిపోయింది. ఎంతో హాడావిడి చేసి, కోర్టుల వరకు వెళ్లి, కేంద్రంతో అక్షింతలు పడ్డ విద్యుత్ అంశం గట్టిగానే షాక్ ఇవ్వటంతో నోరు మెదపటం లేదు. ఇక వైసీపీ ప్రచురించిన 5 లక్షల కోట్ల పుస్తకం ఎక్కడ మాయమైపోయిందో, ఎందుకు ఇప్పుడా పుస్తకాన్ని బయటకు తీయటం లేదో వైసీపీ శ్రేణులకు కూడా అర్థంకాని పరిస్థితి. తాము రికవరీ చేస్తామని, అవసరమైతే జైలుకు పంపుతామని చెప్పిన ప్రగల్భాలు అన్నీ ఒక్కసారిగా మాయం అయిపోయాయి.
ఇక ఏకంగా అసెంబ్లీలోనే జగన్, ఇప్పుడు ఆర్థికమంత్రిగా ఉన్న బుగ్గనలు పట్టిసీమ అవినీతితో కూరుకపోయిందని, ఆ ప్రాజెక్ట్ నిర్మాణమే అవినీతి అంటూ విమర్శించారు. కానీ ఇప్పుడు అదే పట్టిసీమ కట్టిన కంపెనీకే మరోసారి పోలవరం ప్రాజెక్ట్ కట్టబెట్టారు. దీంతో అధికారంలో ఉంటే ఒకమాట, ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఉంటుందా అని సొంతపార్టీ నేతలు సైతం విమర్శలు మొదలుపెట్టారు. ఇన్నాళ్లు చంద్రబాబును తిట్టి, ఇప్పుడు మాసార్ కూడా అదే పనిచేస్తున్నారని విమర్శిస్తున్నారు.