ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఇటీవల హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయితే.. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులపై సీఎం జగన్ సుదీర్ఘ ప్రసంగం చేయడం ఆసక్తికరంగా మారింది. రాజధాని, దాని ఎంపిక, అభివృద్ధి, వికేంద్రీకరణ, శాసనసభకు ఉన్న అధికారాలు, న్యాయ వ్యవస్థకు ఉన్న పరిధి తదితర అంశాలన్నింటిపైనా ఆయన హితబోధ చేశారు.
ఏపీ హైకోర్టు చెప్పినట్లు నెలరోజుల్లో రాజధాని నిర్మాణం సాధ్యం కాదన్నారు జగన్. రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందని చెప్పారు. ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఉండకూడదని సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు.
వికేంద్రీకరణ విషయంలో వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. న్యాయసలహా తీసుకుని ముందుకు వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలన వికేంద్రీకరణను కొలిక్కి తీసుకొస్తామని వివరించారు.
Advertisements
చంద్రబాబుకు అమరావతిపై ప్రేమ లేదన్న జగన్.. ఒకవేళ ఉండి ఉంటే విజయవాడ, గుంటూరులో రాజధాని పెట్టేవారని అన్నారు. ఆ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి 500 ఎకరాల్లో బిల్డింగులు కట్టేస్తే రాజధాని అయ్యేదని చెప్పారు. అమరావతిపైనే రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన రాష్ట్రం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.