వైఎస్ కుటుంబానికి ఆ మతానికి ఉన్న సంబంధం, అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అది వైసీపీకి ఏ రేంజ్ లో ఉపయోగపడిందనే విషయం కూడా తెలియనివారు లేరు. ఆ బలాన్ని అలాగే కాపాడుకుంటూ.. దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో సైతం ఆ వర్గాలన్నీ ఆయనకే మద్దతిచ్చాయనేది స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు కూడా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఎంత వ్యతిరేకత వచ్చినా.. వారు మాత్రం జగన్ ను సమర్ధిస్తూ.. బలంగా మాట్లాడుతున్నారు. ఆ వర్గాన్నే తనకు పర్మినెంట్ సైన్యంగా మార్చుకోవాలని జగన్ సైతం.. తన పథకాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారంలోకి వచ్చాక.. వారి యాక్టివిటీస్ పెరిగిపోయాయి. వారి కోసం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకారం అందుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వరూపానంద స్వామిని సేవించినా, ఎన్ని ప్రత్యేక పూజలు చేసినా.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆ వర్గానికి మాత్రం సహాయ, సహకారాలు సంపూర్ణంగా అందిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే బీజేపీ ఇప్పుడు అదే అంశాన్ని పట్టుకుంది. కన్నా లక్ష్మీనారాయణకు ఆర్ ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేదు, సంప్రదాయక కాషాయ లీడరు కాదు.. అయినా ఆయన సైతం ఇప్పుడు దీని మీదే ఫోకస్ చేస్తున్నారు.
సాక్ష్యాధారాలతో సహా వాటిని ఎక్స్ పోజ్ చేస్తూ విమర్శలు కురిపిస్తున్నారు కన్నా. చర్చి ఫాదర్లకు నెలనెలా గౌరవ వేతనంలా ఇచ్చే నిర్ణయంకాని, ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో వారి ప్రచారానికి అవకాశమిచ్చే అంశాలు గాని, అన్నీ లిస్ట్ చేసి మరీ ప్రకటిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ. ఏపీలో బీజేపీకి హిందూ సంప్రదాయక వర్గాల నుంచి పెద్దగా మద్దతు లేదు. పైగా రాష్ట్రంలో అలాంటి వాతావరణం లేదు. కాని వైసీపీ వైఖరి.. బీజేపీకి ఈ విషయంలో అవకాశం అందించేలానే కనపడుతోంది. ఒక మతానికి వైసీపీ ఇస్తున్న సహకారం గాని, దానితో వారికున్న అనుబంధం ఇవన్నీ బీజేపీకి భవిష్యత్ లో ప్రచారస్త్రాలుగా మార్చబోతుంది. పైగా అధికారులు, ఇతర కీలక పదవుల్లో సైతం వారికే ప్రాధాన్యత ఇస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే తమ సామాజికవర్గం.. లేదంటే అందులో ఆ మతం పుచ్చుకున్నవారయితే ప్రాధాన్యత ఉందని చాలామంది ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు ఇదే అంశాన్ని ఆయుధంగా మార్చుకుని బీజేపీ రంగంలోకి దిగబోతుంది. ఇప్పటివరకు కేవలం ప్రకటనలకే పరిమితం అయిన బీజేపీ… దీనిపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తునే వార్తలొస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో వాతావరణం కాస్త దెబ్బతినే అవకాశం అయితే ఉంది. లెఫ్ట్ నేతలు సైతం ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు. మొన్నటికి మొన్న ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం వెనుక మతపరమైన కుట్ర ఉందని కన్నా ఆరోపించారు. సీపీఐ నేత రామకృష్ణ ఈ విషయంలో కన్నాను తీవ్రంగా తప్పుబట్టారు. ఇందులో మతం ఎందుకు చొప్పిస్తారని విరుచుకుపడ్డారు. కాని బీజేపీ ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు. ఎందుకంటే.. ఈ రకమైన పోలరైజేషన్ వారికి పొలిటికల్ గా లాభం కలిగిస్తుంది. ఒకవైపు జగన్ వారికి కావాల్సినంత అవకాశం అందిస్తుంటే.. దాన్ని ఎలా వదిలేస్తామనే ధోరణిలో బీజేపీ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.