వైకాపా ఎంపీలు బీజేపీలోకి జంప్ కొట్టబోతున్నారా..? 22 మందిలో సగం మందితో బీజేపీకి టచ్‌లోకి ఉన్నారా..? ఎంపీల జంపింగ్‌పై విజయసాయి వద్ద ఉన్న సమాచారం ఏంటీ…? జంపింగ్ ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడుతున్నారా…?
ఇప్పటి వరకు టీడీపీకే ఇబ్బంది అని తీరిగ్గా ఉన్న వైసీపీకి షాక్ ఇవ్వబోతుంది బీజేపీ. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ ఎంపీలను కషాయదళంలో కలుపుకోగా… ఇప్పుడు వైసీపీ లోక్‌సభ ఎంపీలపై బీజేపీ నజర్ పడిందని తెలుస్తోంది. సగం మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు విజయసాయిరెడ్డి తన వేగుల ద్వారా సమాచారం సేకరించి, జగన్ చెవిన వేశారని ప్రచారం నడుస్తోంది.
పది మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ అగ్రనాయకత్వంతో నేరుగా మాట్లాడుకుంటున్నారట. ఇదే విషయాన్ని జగన్‌కు విజయసాయి చేరవేశారట. దీంతో కోపంతో జగన్ ఊగిపోయాడట. అయితే విజయసాయి ఇలా ఎంపీలపై నేరుగా ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్లు బీజేపీలోకి వెళ్లి ప్రత్యేకవర్గంగా గుర్తింపు కోరే అవకాశం ఉందని.. నెమ్మదిగా మందలించాలని సూచించారట. విజయసాయిరెడ్డి సూచనతో జగన్ కొద్దిగా తగ్గి ఎంపీలను ఇలా కాకుండా నెమ్మదిగా మందలించారట. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అనే పేరుతో తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం వైసీపీ ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఎంపీలకు నేరుగా హెచ్చరికలు జారీ చేశారట.
ఎంపీలంతా పార్టీ గీతలోనే నడవాలి. కొందరు ఎంపీలు వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా చెబుతున్నారు. కొందరు ఎంపీలు నేరుగా కేంద్ర మంత్రులు, ప్రధానిని కలుస్తున్నారు. ఇలా మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే షోకాజ్ నోటీసు జారీ చేయాల్సి వస్తుంది అని ఘాటుగా మందలించారట. వైకాపా ఎంపీలంతా ఇక నుంచి ఢిల్లీలో ఎక్కడి వెల్లాలన్నా, ఎవరిని కలవాలన్నా పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారట. ప్రధానిని, కేంద్రమంత్రులను వైసీపీ ఎంపీలు కలవాలనుకుంటే ఆ విషయం ముందుగా విజయసాయిరెడ్డికి తెలియజేయాలని, ఆయన అంగీకరించి అనుమతిస్తేనే కలవాలని..లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ ఘాటుగానే హెచ్చరించారు.
అయితే అసలు విషయం ఏంటంటే వైసీపీకి చెందిన కొందరు ఎంపీలు నేరుగా బీజేపీ అగ్రనేతలతో టచ్‌లో ఉన్నారట. వారు గ్రీన్ సిగ్నల్ ఇప్పుడిస్తే…ఇప్పుడే కాషాయం కండువా కప్పుకునేందుకు సిద్ధమంటూ సంకేతాలు పంపారట. అయితే బీజేపీ అధిష్టానమే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీలు, కోస్తా, రాయలసీమకు చెందిన వైసీపీ ఎంపీలు బీజేపీ వారు ఎప్పుడు పిలుస్తారా? అని ఎదురుచూస్తున్నారట. తీవ్ర ఆందోళనలో ఉన్న విజయసాయిరెడ్డి, జగన్‌లు సామదానబేధ దండోపాయాలు ప్రయోగించి ఏదో విధంగా తమ ఎంపీలు బీజేపీలో చేరకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
అయితే కమలనాథులు కన్నుగీటితే చాలు..లోక్‌సభలో ఎంపీల సంఖ్యలో 4వ స్థానంలో ఉన్న వైసీపీ నుంచి 10 మందికి పైగా ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇప్పుడు ఈ ప్రచారం ఏపీలో హల్‌చల్ అవుతోంది.