తిరుపతి ఉప ఎన్నికకు ముహుర్తం ముంచుకొస్తుంది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు గాలివాటం కాదని నిరూపిస్తూ… కనీసం నాలుగు లక్షల మెజారిటీతో గెలవాలని వైసీపీ టార్గెట్ పెట్టుకుంది.
అయితే, ప్రచార సరళి చూస్తే ఆ మెజారిటీ వచ్చేలా లేదని… సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 14న సాయంత్రం తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైసీపీ వర్గాలంటున్నాయి.
తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందన్న విమర్శలున్నాయి. టెంపుల్ సిటీ నుండి తాము హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని, అన్ని మతాలను గౌరవిస్తానని… పేదల సంక్షేమం కోసమే తాను పనిచేస్తానని జగన్ ఆ వేదిక నుండి సందేశం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తనను హిందూ వ్యతిరేక వ్యక్తిగా ముద్ర వేయాలనుకుంటున్న బీజేపీ-జనసేన, టీటీపీలకు ఉమ్మడిగా సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతోనే హాఠాత్తుగా తిరుపతి ఎన్నికల ప్రచారంకు రెడీ అయ్యారన్న వాదన వినిపిస్తుంది. ఎన్నికలున్నాయన్న ఉద్దేశంతోనే రమణదీక్షితులుకు సమయం ఇవ్వటం, తాను కూడా తిరుమలలో అన్యమత ప్రచారం జరగటం లేదని సర్టిఫై చేయటం అంతా ఎన్నికల వ్యూహాంలో భాగమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది.