ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక.. మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా వెళ్లిన రోజు సాయంత్రమే నేరుగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ భేటికి సంబంధించి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ భేటీలో ప్రధాని మోదీ- సీఎం జగన్ మధ్య ఏఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ముందుగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. మంత్రి వర్గ విస్తరణపై ప్రధాని మోదీకి పూర్తి వివరాలు అందించనున్నట్టు సమాచారం.
అనంతరం రాష్ట్రానికి సంబధించి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.. పోలవరం సహా పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే దిశ చట్టం, మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కూడా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ భేటీలో ప్రధాని మోదీ-సీఎం జగన్ మధ్య ఏఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారుతోంది.
అలాగే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జగన్ సమావేశం కోసం సీఎంవో అపాయింట్‌మెంట్ కోరింది. దీనిపై హోం శాఖ కార్యాలయం స్పందించాల్సి ఉంది. అమిత్ షా అపాయింట్ ఇస్తే ఆయనతో కూడా జగన్ సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హస్తిన పర్యటనలో ఉన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం కూడా వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీకి చేరుకోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ సైతం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.. కుదిరితే కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ సీఎం వైద్య పరీక్షల కోసం హస్తినకు వెళ్లారనే చర్చ జరుగుతోంది.