ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఇటీవల విశాఖపట్నం రాజధానిగా మారబోతుందని, తాను కూడా అక్కడకే షిఫ్ట్ అవుతానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం విశాఖకు రాజధాని తరలింపు పనుల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు సైతం కొంతకాలంగా విశాఖ వేదికగా పాలన చేపట్టనున్నామని చెబుతూ వస్తున్నారు.
అయితే రాజధాని తరలింపుపై అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ.. ప్రభుత్వ పెద్దల నుంచి మాత్రం అధికారులకు ఆదేశాలను ఇస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లోని భవనాలను రహస్యంగా పరిశీలిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నివాసానికి అనువుగా ఉండే ప్రాంతాన్ని వెతికే పనిలో పడ్డారు అధికారులు.
ముఖ్యంగా బీచ్ రోడ్డులో అనువైన ఇంటికోసం అధికారులు సీక్రెట్ గా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్తు పక్క నుంచి రోడ్డుని వెడల్పు చేయడం కోసం పనులు చేపట్టారు. దీంతో ఇక్కడే పక్కాగా సీఎం ఇల్లు ఉండనుందని టాక్ వినిపిస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. వచ్చే నెలలో సీఎం నివాసం విశాఖకు మార్చనున్నారట.. మార్చి 22, 23 తేదీల్లో ముఖ్యమంత్రి గృహ ప్రవేశం ఉంటుందనే వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ విషయాన్నీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.