తెలంగాణ సీఎం కేసీఆర్ బయటకు గంభీరంగా కనిపిస్తున్నా.. ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆయనకు తలనొప్పిలా మారుతున్నట్టు తెలుస్తుంది. హుజూరాబాద్ ఉపఎన్నిక తరువాత టీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పడిపోయింది. దీనికి తోడు దాన్యం కొనుగోలు అంశంలో ఏర్పడిన గందరగోళం కూడా గులాబీ నేతల్ని జనంలో పలుచన చేసింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కు మరో పెద్ద షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ అంతర్గత సర్వేలో వచ్చిన ఫలితాలు సీఎం కేసీఆర్ ను గట్టి షాక్ కు గురి చేసినట్టు తెలుస్తుంది. కేబినేట్ మంత్రులపై చేసిన ఈ సర్వేలో ఐదుగురు మాత్రమే గెలుస్తారని తేలినట్టు సమాచారం. ప్రస్తుతం కేబినేట్ లో 17 మంది మంత్రులు ఉండగా.. కేసీఆర్ తో పాటు మరో నలుగురు మంత్రులు మాత్రమే గెలుపుగుర్రం ఎక్కుతారట. ఇటీవల 41 ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదని ఓ రిపోర్టు సీఎం దగ్గరకి వచ్చిందట. దానికితోడు మంత్రులుపై చేసిన సర్వేలో ఫలితాలు మరింత దారుణంగా ఉండటంతో కేసీఆర్ ఆత్మరక్షణలో పడ్డారు.
17 మంది మంత్రులలో 12 మందికి ప్రతికూలంగా ఈ సర్వే ఫలితాలు రావడంతో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారట. ప్రజల్లో ఇంత వ్యతిరేకతకు కారణమేంటని విశ్లేషణ చేస్తున్నట్టు సమాచారం. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పై ప్రజల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు మంత్రుల తీరు వివాదాస్పదంగా ఉందని తేలింది. ఇటీవల హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఇద్దరు మంత్రుల రాసలీలల ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అసభ్యకర మాటలు, రాసలీలల ఆడియోలు.. ఇలా లెక్క లేనన్ని బయటకు వస్తున్నాయి. వరుసగా ఏడున్నరేళ్లు అధికారంలో ఉండటంతో మంత్రుల్లో నియంతృత్వం బాగా పెరిగిపోయిందని ప్రజలు బావిస్తున్నట్టు తెలుస్తుంది. మాట్లాడే మాటల్లో, చేసే పనుల్లో హుందాతనం పూర్తిగా కోల్పోయారని జనం విసుక్కొంటున్నారని సమాచారం.
ఇక, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలపై భూకబ్జా ఆరోపణలు పెరిగిపోవడంతో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. ఇక, పార్టీలో కూడా గ్రామస్థాయి కార్యకర్తలు బాగా విసిగి చెందారని తెలుస్తోంది. ఉద్యమ సమయం కష్టపడిన వాళ్లని పూర్తిగా పక్కన పెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. పార్టీలోని వర్గ పోరు కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇది కూడా గెలుపు అవకాశాలను దెబ్బ తీస్తోంది. ఇలాంటి పలు అంశాలు సర్వే ఫలితాలపై ప్రభావం చూపి ఉండొచ్చు.
ఈ సర్వేలో గెలుపు గుర్రాలు ఎవరు? ఇంటి బాటపట్టేదెవరు అనే దానిపై కేసీఆర్ కు స్పష్టత వచ్చింది. దీంతో, వాళ్లందరిని మార్చుతారా? అందులో కొందరనే మార్చుతారా? ఒకేసారి అందరిని మార్చితే పార్టీలో కుదుపు వచ్చే అవకాశం కూడా ఉందని సీఎం కేసీఆర్ భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇది గులాబీ బాస్ కు పెద్ద పరీక్షే అని రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు.