రాష్ట్రంలోని వరద ప్రభావాన్ని అంచనా వేసేందుకు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు సీఎం కేసీఆర్. భద్రాచలంలో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి తొలుత శాంతి పూజలు నిర్వహించారు. తర్వాత వంతెన పైనుంచి గోదావరి పరిసరాలు పరిశీలించారు. కరకట్టను పరిశీలించిన సీఎం.. వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత భద్రాచలంలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందని.. దీని వెనుక విదేశీ కుట్ర ఉందని వ్యాఖ్యానించారు కేసీఆర్. గతంలో లద్దాఖ్ లోని లేహ్, ఉత్తరాఖండ్ లో అలాగే చేశారని గుర్తు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా అలాంటి కుట్ర చేసినట్లు సమాచారం వచ్చిందన్నారు. వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల ఇలాంటి ఉత్పాతాలు వస్తాయని, ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు సీఎం.
ఈ నెల 29 వరకు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోందని.. ప్రమాదం తప్పిందని అనుకోవద్దని అధికారులకు సూచించారు కేసీఆర్. వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10 వేలు అందిస్తామన్నారు. అలాగే బాధిత కుటుంబాలకు రెండు నెలలపాటు 20 కేజీల చొప్పున ఉచిత బియ్యం అందిస్తామని తెలిపారు. భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వాత కాలనీలు నిర్మిస్తామని.. ఎత్తైన ప్రదేశంలో వీటి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
కడెం ప్రాజెక్టుకు చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చిందన్న కేసీఆర్… అదృష్టం వల్ల ప్రాజెక్టు దక్కిందని అన్నారు. గతంలో గంగానది వరదల సమయంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన సాంకేతిక విధానాలను అవలంభించాలని అధికారులకు సూచించారు కేసీఆర్. అవసరమైతే ఐఐటీ ప్రొఫెసర్ల సాయం తీసుకోవాలని నిర్దేశించారు.