తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ముందు ఆయన భార్య శోభ కు వైద్య పరీక్షల కోసం వెళ్లారని వార్తలు వచ్చాయి. ఆమెతోపాటు కేసీఆర్ కూడా ఆస్పత్రికి వెళ్లారు. అయితే.. కేసీఆరే అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. ఆదివారం ఉదయం నుండి గ్యాస్ట్రిక్ సమస్యతో కేసీఆర్ బాధపడుతున్నట్టు సమాచారం.
ఢిల్లీలో ఈడీ విచారణకు సంబంధించి కవితతో భేటీ అయ్యారు కేసీఆర్. వీరిద్దరి సమావేశం గంట వరకూ సాగింది. అలాగే, న్యాయనిపుణులతోనూ ప్రగతి భవన్ లో చర్చలు సాగాయి. అయితే.. ఆ తర్వాత కేసీఆర్ అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.
కడుపు నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో కేసీఆర్ బాధపడుతున్నట్లు సమాచారం. కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, ఇతర కుటుంబ సభ్యులు, ఎంపీ సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇతర బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కేసీఆర్ కు పలురకాల వైద్య పరీక్షలు చేశారు ఏఐజీ వైద్యులు. ఎండోస్కోపీ, సీటీ స్కాన్ తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని వినోద్ రావు తెలిపారు.