వరద ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి సీఎం కేసీఆర్ స్వయంగా బయల్దేరిన విషయం తెలిసిందే. కాగా ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరికొద్ది సేపట్లో రామన్న గూడెం నుంచి ఐటీడీఏ కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరవనుండగా.. ఐటీడీఏ మెయిన్ గేట్ ఎదుట వరద నిర్వాసితులు ఆందోళనకు దిగారు.
‘‘ సర్వం కోల్పోయాం.. మమ్మల్ని ఆదుకోండి. సీఎంకు మా గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వండి’’ అంటూ నినాదాలు చేశారు. ‘‘మేం ఏటూరునాగారం మండల కేంద్రంలోని బెస్తగూడెం, ఎస్సీ కాలనీ, శివాలయ వీధి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాం. వర్షాలకు మా ఇండ్లు మునిగిపోయాయి. ఇండ్లలోకి నీరు చేరి బియ్యం, బట్టలు తదితర సామగ్రి పాడైయ్యాయి. మాకు ఆర్థిక సహాయం అందించాలి’’ అని వారు డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని ఆందోళన విరమింపజేశారు.
వచ్చే ఏడాది ఈ సమస్య లేకుండా చేస్తాం:
రామన్నగూడెం లో ఏటా వరదలు వస్తున్నాయని, వచ్చే ఏడాది వరద సమస్య లేకుండా చూస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. ముంపునకు గురైన ఎస్సీ, ఎస్టీ కాలనీ లను పరిశీలించిన సీఎం శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజలంతా బాగుండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఏటూరునాగారం, రామన్నగూడెం పరిధిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సందర్బంగా.. ఓ గ్రామంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ ముంపు పై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కు వివరించారు . పర్యటనలో భాగంగా కటాక్షాపూర్ చెరువు గురించి సీఎస్ సోమేష్ కుమార్ కు సీఎం స్వయంగా వివరించారు.
అంతకుముందు సీఎం కేసీఆర్ ములుగు జిల్లాలోని రామన్న గూడెంలో ఏరియల్ సర్వే చేశారు. ప్రకృతి విపత్తుతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని సీఎం కేసీఆర్ హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాలను చూస్తూ సీఎం ఏటూరునాగారానికి చేరుకున్నారు. కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి ముంపు బాధితులను సీఎం పరామర్శించారు.