తిమ్మాపూర్ ఆలయానికి సీఎం కేసీఆర్ మరో రూ. 7 కోట్లు మంజూరు చేశారు. కామారెడ్డి జిల్లాలో ఆయన ఈ రోజు పర్యటించారు. జిల్లాలోని తిమ్మాపూర్ శ్రీదేవీ భూదేవీ సమేత వెంకటేశ్వర ఆలయాన్ని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సమైక్య రాష్ట్రంలో పాలకులు నీటి ప్రాజక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. సింగూరులో నీటి కోసం రైతులు ఉద్యమాలు చేశారని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో నిజాంసాగర్ కూడా ఒక భాగమేనన్నారు. బాన్సువాడ ప్రాంతంలో గతంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ప్రస్తుతం అక్కడ రూ.1500 కోట్ల వరి పంట సాగవుతోందని ఆయన వెల్లడించారు. భవిష్యత్‌లో బాన్సువాడ ప్రజలకు స్పీకర్ పోచారం సేవలు అవసరమని ఆయన అన్నారు. దీంతో పాటు నియోజకవర్గానికి రూ.50 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
అంతకు ముందు ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చారు.