కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీదేవీ, భూదేవీ సమేత వెంకటేశ్వర స్వామిని సీఎం కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అక్కడ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్బంగా దాతల సహాయంతో స్వామి వారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు.
ఆ తర్వాత సీఎం దంపతులను వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీఎం దంపతుల వెంట స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు సంతోష్‌కుమార్, బీబీ పాటిల్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
సీఎం కేసీఆర్ దంపతులు మొదట బాన్సు వాడకు వెళ్లగా వారికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తిమ్మాపూర్‌లో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.