టాస్ వేస్తే.. బొమ్మా,.. బొరుసా అని అడుగుతారు. కాని తెలుగురాష్ట్రాల ప్రజలకు టాస్ వేస్తే.. ఏది కావాలో చెప్పే ఛాన్స్ లేకుండా పోయింది. బొమ్మ, బొరుసా అని అడగటానికి లేకుండా రెండు వైపులా బొమ్మలే ఉన్నయి.. బొరుసు లేకుండా పోయింది. ఒకవైపు కేసీఆర్.. రెండోవైపు జగన్.. అదీ పరిస్ధితి. ఒకరికొకరు జిరాక్స్ అన్నట్లే వ్యవహారాలు నడుస్తున్నాయి. ఒకరు తెలంగాణలో సంప్రదాయకంగా ఆ రేంజ్ వారే.. మరొకరు రాయలసీమలో ట్రెడిషనల్లీ అదే రేంజ్. ఒకరినొకరు తెగ ఫాలో అయిపోతున్నారు. జర్నలిస్టుల విషయంలోనూ ఇద్దరూ ఒకే రూట్లో వెళ్లిపోతున్నారు. ఎవరినీ పట్టించుకోకుండా.
కేసీఆర్ కొత్త సెక్రటేరియేట్ లోకి జర్నలిస్టులను రావొద్దని ఆదేశాలిచ్చేశారు. ఎంతి బతిమాలాడుకున్నా.. చీఫ్ సెక్రటరీ సైతం.. నేనేం చేయలేనంటూ చేతులెత్తేశారు. ఇక్కడ ఏపీలో ఇదే వ్యవహారం కాస్త డొంకతిరుగుడుగా నడుస్తోంది. సెక్రటేరియేట్ కు కేబినెట్ ఉంటే తప్ప జగన్ రారు. అన్ని సమీక్షా సమావేశాలు క్యాంప్ ఆఫీసులోనే. అక్కడికి మాత్రం జర్నలిస్టులకు నో ఎంట్రీ.
గతంలో విధానపరమైన అంశాలు చర్చించేటప్పుడు.. మీడియాను రానిచ్చేవారు. కాస్త సీక్రెట్.. బయటకు తెలియకూడదనుకుంటే.. రానిచ్చేవారు కాదు. ఇప్పుడు దేనికీ రానివ్వటం లేదు. పైగా అధికార పార్టీ మీడియావారంతా.. ఇప్పుడు అధికారికంగా సీఎం దగ్గరే పని చేస్తున్నారు. వారే అంతా రెడీ చేసి.. ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. వారు రిలీజ్ చేసే దాకా.. ఏం జరుగుతుందో.. ఎవరికీ తెలియదు. సీఎం ఏం చెప్పినా చెప్పకున్నా.. వారికనుగుణంగా ప్రెస్ నోట్ రెడీ అయి వచ్చేస్తుంది, సీఎం ఇలా అన్నారు.. అలా అన్నారు అంటూ.
పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేసిన మరుసటి రోజు.. ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్షా సమావేశం నడుస్తోంది. ఆ లాంగ్ మార్చ్ కు మంచి స్పందన వచ్చింది.. కొంపలంటుకున్నాయన్న విషయాన్ని వైసీపీ నేతలు గమనించారు. మొత్తానికి ధైర్యం చేసి అధినేతకు తెలియచేశారు. మేం మాత్రమే తిట్టడం కాదు.. జగన్ గారు కూడా ఏదో ఒకటి చెప్పాలని రిక్వెస్ట్ చేశారు. దాంతో అప్పటికప్పుడు అదే సమావేశంలో ఇసుక గురించి సమీక్ష చేసినట్లు.. వరదలు తగ్గగానే అందుబాటులోకి వస్తుందని.. అక్రమ రవాణాపై కొత్త చట్టం తెస్తామని సీఎం చెప్పినట్లు.. న్యూస్ వచ్చేసింది. ఆర్ అండ్ బీ సమావేశంలో ఇసుక రివ్యూ ఏంటబ్బా.. అని ఆరా తీస్తే.. ఆయన సమీక్ష చేయలేదు.. చెప్పలేదు.. ఏం చెప్పాలనుకుంటున్నారో.. దాన్ని ప్రెస్ రిలీజ్ చేసేశారంతే. అదీ పరిస్ధితి.
అసలు సంగతి ఇంకొకటుంది. కేసీఆర్ సారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి.. పంచ్ లు దంచికొడుతుంటారు. ప్రశ్నలు వేస్తే.. నువ్వేం జర్నలిస్టువయ్యా .. ఎవరిని ఏమడుగుతున్నావ్ అంటూ ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చేస్తారు. అయినా ఆయనది నడుస్తోంది. ఇక్కడ మాత్రం జగన్ సాబ్.. ముఖ్యమంత్రి కాక ముందు ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. ఇక అంతే .. అప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక.. ప్రెస్ మీట్ పెడితే ఒట్టు. ఏదైనా ఎవరో ఒక మినిస్టర్ చెప్పాల్సిందే.. ఏమైనా తేడా ఉంటే.. సీఎంతో చీవాట్లు తిని, నాలిక్కరుచుకుని.. మళ్లీ చెప్పాల్సిందే. అంతేగాని సారువారు మాత్రం ఏదైనా స్కీం ఓపెనింగ్ చేసినప్పుడు.. బహిరంగసభల్లో మాట్లాడినప్పుడు.. ఆ ముత్యాలను మనం ఏరుకోవాల్సిందే.