– ఎట్టకేలకు గవర్నర్ ను కలిసిన కేసీఆర్
– ఒకరినొకరు నవ్వుతూ పలకరింపులు
– 9 నెలల తర్వాత రాజ్ భవన్ లో అడుగుపెట్టిన సీఎం
– కిషన్ రెడ్డితోనూ కేసీఆర్ ముచ్చట
– అందరి సమక్షంలో సీజేగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణం
ఎట్టకేలకు రాజ్ భవన్ లో అడుగు పెట్టారు సీఎం కేసీఆర్. దాదాపు 9 నెలల తర్వాత రాజ్ భవన్ గేట్ దాటారు. తెలంగాణ హైకోర్టు ఐదో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్ భవన్ లో ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ తమిళిసై. ఈ కార్యక్రమానికే సీఎం హాజరయ్యారు.
ప్రమాణ స్వీకారం తర్వాత తేనేటి విందులో పాల్గొన్న కేసీఆర్… గవర్నర్ తో నవ్వుతూ ముచ్చటించారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోనూ సంతోషంగా మాట్లాడారు. రాజ్ భవన్ తో పెరిగిన గ్యాప్ దృష్ట్యా సీఎం హాజరుకాకపోవచ్చని అందరూ భావించారు. కానీ.. అనూహ్యంగా కేసీఆర్ పాల్గొనడం సరికొత్త చర్చకు దారితీసింది.
కొన్నాళ్ల క్రితం గవర్నర్ వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే సమయంలో తమిళిసై ప్రోటోకాల్ పాటించడం లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పంచాయితీ కేంద్రం దాకా వెళ్లింది. ఆ తర్వాత గవర్నర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని టీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్ మాట కాదన్న తర్వాతే.. ప్రగతి భవన్ కు రాజ్ భవన్ కు మధ్య దూరం పెరిగింది.
తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. ప్రభుత్వం తరఫున ప్రజల కోసం మాట్లాడేందుకు ఎవరైనా రాజ్ భవన్ కు రావొచ్చని తమిళిసై స్పష్టం చేశారు. కేసీఆర్ సీజే ప్రమాణ స్వీకారానికి వెళ్తారా? లేదా? అనే చర్చ జరిగింది. దీనికి కారణం.. టీహబ్ ప్రారంభోత్సవం. అప్పటిదాకా కేటీఆర్ ప్రారంభిస్తారని అనుకున్న ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారని ప్రకటించడంతో.. అటు ప్రమాణ స్వీకరం.. ఇటు ప్రారంభోత్సవం ఒకేరోజు కావడంతో ఏం జరుగుతుందో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే.. కేసీఆర్ ఎట్టకేలకు ప్రగతి భవన్ లో అడుగుపెట్టారు. గవర్నర్ ను కలిసి ముచ్చటించారు.