యాదాద్రి మహాక్షేత్రం పునః ప్రారంభమైంది. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వేద పండితులు. వేదమంత్రోచ్చారణల నడుమ కన్నుల పండువగా ఈ తంతు కొనసాగింది. ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో పుష్కరాంశ శుభ ముహూర్తంలో ఈ మహాకుంభ సంప్రోక్షణను నిర్వహించారు.
సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సుదర్శన స్వర్ణచక్రానికి సీఎం సమక్షంలో యాగజలాలతో సంప్రోక్షణ జరిగింది. అలాగే ప్రధానాలయం గోపురాలపై కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ చేశారు. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో జరిపించారు. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది.
సంప్రోక్షణకు ముందు కేసీఆర్ దంపతులు లక్ష్మీ నర్సింహుడికి తొలి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం తర్వాత స్వామివారి శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ ప్రదక్షిణలో సీఎం కేసీఆర్ దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి స్వామివారి శోభాయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో బంగారు కవచ మూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లను ఉంచారు. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య శోభాయాత్రను నిర్వహించారు. తర్వాత ప్రధానాలయ విమాన గోపురం దగ్గర మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్నారు సీఎం.