సామాన్య జనం తరపున జర్నలిస్టులు మాట్లాడతారు. జనం అడుగుతున్న ప్రశ్నలను ప్రభుత్వం ముందుంచి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తారు. జర్నలిస్ట్ అడిగే ప్రశ్న మనిషిని బట్టి, మనిషికి ఉన్న పదవిని బట్టి ఉండదు. ప్రశ్న సూటిగా , స్పష్టంగా ప్రజల కోసం ఉంటుంది.
ఇవాళ్టి సీఎం మీడియా సమావేశంలో , గత సమావేశంలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు తమకు అనుకూలంగా ఉంటే ఓకే, లేదంటే దబాయించడం మనం చూశాం. ఇది జర్నలిస్ట్ లకు అవమానం కాదా?
ఒక జర్నలిస్ట్ ను పట్టుకొని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగే పరిస్థితి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా లేదు. అంతే కాదు కేసీఆర్ మీడియా సమావేశం జరుగుతున్నంత సేపూ సీఎం వెనకాల ఉన్న ఒకప్పటి జర్నలిస్టులు, ఇప్పటి ప్రభుత్వ పదవుల్లో ఉన్న మేధావులూ…జర్నలిస్టుల ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఇక చాలు అంటూ సైగలు చేయడం దేనికి సంకేతం. ఇది మీడియా స్వేచ్ఛను హరించడం కాదా? ఒక ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నను, అధికార పక్షం ముందు ఉంచితే, కోట్లాది జనం ప్రత్యక్షంగా చూస్తున్నప్పుడు బూతు పదాలు మాట్లాడడం సరైన పద్దతి ఎలా అవుతుంది??
ఒకటి మాత్రం నిజం…తెలంగాణ జర్నలిస్టులు లేకుండా తెలంగాణ ఉద్యమం అంత ఉవ్వెత్తున లేచేది కాదు. ఉద్యమ సమయంలో మీరు రాళ్ళ దెబ్బలు, లాఠీ దెబ్బలు తిన్నారో లేదో కానీ తెలంగాణ జర్నలిస్టులు రక్తాన్ని దారపోసారు. ఆ జర్నలిస్ట్ ల రక్తానికి సాక్ష్యం…మీరు అనుభవిస్తున్న పదవులు! దయచేసి తెలంగాణలో జర్నలిజంని బ్రతకనివ్వండి.