తెలంగాణలో కొత్త మలుపులు తిరుగుతున్న రాజకీయాలను.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ మార్చేసిందా? టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటున్న బీజేపీ చీఫ్ బండి సంజయ్ దూకుడుకు.. ప్రధాని మోడీతో కేసీఆర్ భేటీ బ్రేక్ వేసిందా.. అంటే అవుననే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మోడీ.. వస్తున్న కాస్కో.. అంటూ హైదరాబాద్‌లో పిడికిలి ఎత్తిన కేసీఆర్.. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి అదే చేతులతో నమస్కారం చేయడంపై సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటర్లు కనిపిస్తున్నాయి. గత్తర లేపుతానన్న కేసీఆర్ మాటలు.. అన్నీ ఉత్తవేనా అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
సోషల్ మీడియా సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత రాష్ట్రంలో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మధ్యంతరం తప్పదు.. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమంటూ వార్నింగులు ఇస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇకపై కూడా అదే టెంపో కొనసాగిస్తారా అని అంతా చర్చించుకుంటున్నారు.
సాధారణంగా కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చారంటే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వాతావరణం మారిపోతుంది. ప్రధాని మోదీకి అనుకూలంగా ప్రకటనలు వచ్చేస్తుంటాయి. అయితే గతంలో పరిస్థితులు వేరు. ఇప్పుడు వేరు. కొద్ది రోజులుగా బీజేపీ దూకుడు చూస్తోంటే.. రానున్న ఎన్నికల్లో నిజంగానే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా మారబోతోందా అన్నట్టుగా వాతావరణం తయారైంది. మరి ఈ సమయంలో కేసీఆర్ ఢిల్లీ రాజీ కోసం వెళ్లారా.. లేక రాష్ట్రం కోసమే వెళ్లారా అన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.