పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం పగతి భవన్ లో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేసీఆర్.. తమ పార్టీ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని, గవర్నర్ వ్యవస్థపై పార్లమెంటులో చర్చకు పట్టుబట్టాలని ఆయన సూచించారు. విభజన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని , కేంద్ర వైఫల్యాలను ఎండగట్టడానికి సభ్యులు ఈ సభను వినియోగించుకోవాలని ఆయన అన్నారు.
తెలంగాణాలో అమలవుతున్న రైతు బంధు, ఉచిత విద్యుత్ వంటి వివిధ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు. తెలంగాణాకు రావాల్సిన నిధులపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు.
గత ఏడాది కూడా పార్లమెంటులో నాడు టీఆరెస్ ఎంపీలు అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగాన్ని బహిష్కరించారు. వివిధ ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నందుకు నిరసనగా వారు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. ఈ సారి కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించడం చూస్తే మళ్ళీ కేంద్రంతో తాడో, పేడో తేల్చుకునేందుకే సిద్ధమైనట్టు కనిపిస్తోంది.