ఓవైపు ప్రభుత్వ బడులు మూసివేస్తూ కొత్త విద్యావిధానం తీసుకొస్తే ఫలితం ఉంటుందా…? అక్షరాస్యతలో బీహర్ సరసన చేరాక కూడా సీఎం కేసీఆర్ ఎందుకు మేల్కొవటం లేదు…? చినజీయర్ స్వామి సూచనలు పాటిస్తూ తెచ్చే కొత్త విద్యావిధానం సత్ఫలితాలు ఇస్తుందా…? ఆదర్శాలు పోయి దార్మికత పుస్తకాల్లో భాగం కానుందా…?
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డక విద్యా వ్యవస్థ ఎలా పతనమవుతూ వస్తుందో అందరికీ తెలుసు. వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నా పట్టించుకోకుండా… ప్రభుత్వ పాఠశాలలను మూస్తూ వస్తున్నారు. కేవలం గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామన్న పేరుతో తండా నుండి రాజధాని వరకు ఉన్న ప్రభుత్వ బడులను క్రమంగా మూసివేస్తున్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా టీచర్ పోస్టుల భర్తీని చేపట్టలేదు. అదీ ఒక నోటిఫికేషన్ పూర్తి చేయడానికి రెండు సంవత్సరాలు తీసుకున్నారు. దీన్ని బట్టి టీఆర్ఎస్ సర్కార్‌కు ప్రభుత్వ బడులన్నా… విద్యావిధానం అన్నా ఎంత వివక్ష ఉందో అర్థం చేసుకోవచ్చునంటూ పలువురు మేధావులు విమర్శిస్తున్నారు.
ఇప్పుడు సీఎం కేసీఆర్ కొత్త విద్యావిధానం తెస్తాం, అందుకు తన ఆద్యాత్మిక గురువు చినజీయర్ స్వామి వంటి వారి సలహాలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేశారు. మాజీ పోలీస్ అధికారులు, ఆద్మాత్మిక గురువుల సలహాలు, మార్గదర్శకత్వంలో కొత్త సిలబస్ తెస్తాం అంటూ ప్రకటించారు. దీనిపై విద్యావంతులు ఫైర్ అవుతున్నారు. ఆదర్శాలతో, చరిత్ర ఆధారంగా ఉన్న సిలబస్‌లో ఇప్పుడు ధార్మికత తెచ్చి పిల్లలకు ఏం నూరి పోయాలనుకుంటున్నారు, అంత ప్రేమ ఉన్న మీరు మీ ఆరు నెలల విద్యా శాఖపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్‌లో తెలంగాణ అక్షరాస్యతలో వెనుకబాటులో ఉందని, 4 నిరక్షరాస్య రాష్ట్రాల్లో ఒకటిగా ఉందని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బీహర్, రాజస్థాన్‌ల స్థాయికి పడిపోయింది. మొత్తం అంశాన్ని పట్టించుకోకుండా… కేవలం ధార్మికత, ఆధ్యాత్మికత కోసం సిలబస్ మార్చటంతో విద్యావిధానం వెలిగిపోదని మేధావులు విమర్శిస్తున్నారు.