బీజేపీ 8 ఏళ్లలో భారీ స్కాంలు జరిగాయని ఆరోపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. మోడీ హైదరాబాద్ పర్యటన, బహిరంగ సభ నేపథ్యంలో తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇప్పటిదాకా నల్లధనం ఎంత వెనక్కి తీసుకువచ్చారని ప్రశ్నించారు. నిరర్ధక ఆస్తులతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని.. శ్రీలంక విషయంలో మోడీ మాట్లాడకపోతే దోషిగా పరిగణిస్తామన్నారు. ఒకవేళ దోషి కాదని ఆదివారం సభలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్.
రూపాయి పతనంపై మన్మోహన్ హయాంలో గొంతు చించుకున్న బీజేపీ నేతలు.. మరి.. మీ పాలనలో రూపాయి ఎలా పతనమౌతోందో మాట్లాడతారా? అని అడిగారు. రూపాయ పతనం చూస్తే బీజేపీ పాలన ఎంత గొప్పదో అర్థమౌతుందన్నారు. నేపాల్, బంగ్లాదేశ్ రూపాయి విలువ పడిపోదన్న కేసీఆర్.. భారత్ కే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. మకాన్ లేదు.. దుకాన్ లేదు.. ఉపాధి లేదు.. మోడీ పాలనలో ఏమీ లేవని చురకలంటించారు. ఆఖరికి నోటికాడ కూడు లాక్కుంటున్నారని ఆరోపించారు.
మోడీపై జనంలో ఆగ్రహం పెరుగుతోందన్న సీఎం.. కరోనా నియంత్రణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించి జనాన్ని రోడ్డుపాలు చేశారని.. బీజేపీ విధానాలతో దేశం నష్టపోతోందన్నారు. దేశంలో 5.6 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. మోడీ హయాంలో 8 శాతం దాటిందని మండిపడ్డారు. ఇప్పటివరకూ 9 ప్రభుత్వాలను పడగొట్టారని.. ప్రతీరోజూ విజయవంతంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఫైరయ్యారు. నిత్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని.. మత విద్వేషాలతో దేశాన్ని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలు విద్వేష ప్రసంగాలతో దేశంలో అస్థిరత సృష్టిస్తున్నారని.. ఇదేనా మనం కోరుకున్న భారతదేశం అని ప్రశ్నించారు. మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని పడగొట్టాలని భావిస్తున్నారని.. అలాగే చేయండి.. మేం మీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు కేసీఆర్. జాతిపిత గాంధీని కూడా అవమానిస్తున్నారని.. ఈ సందర్భంగా అమెరికా ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అమెరికా ఎన్నికలంటే అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలనుకున్నారా? అని మోడీని కడిగిపారేశారు. గతంలో ట్రంప్ సర్కార్ వస్తుందని మోడీ అనడమేంటి?.. దాని సంకేతాలు ఎలా ఉంటాయో ఊహించలేదా?.. అమెరికా ఎన్నికలంటే ఆటలా? అని ప్రశించారు. మోడీ మళ్లీ గెలుస్తుందన్న ట్రంప్ సర్కార్ గంగలో కలిసిందన్నారు. రూ.30 లక్షల కోట్లు రాష్ట్రాల నుంచి తీసుకున్నారని.. దేశంలో పుష్కలంగా నీటి వనరులున్నా తాగునీటి కోసం జనం అల్లాడుతున్నారని విమర్శించారు. కనీసం ఢిల్లీ జనం గొంతు కూడా తడపలేకపోతున్నారన్నారు. ఇది బీజేపీ ఎనిమిదేళ్ల పాలనకు నిదర్శనమని చెప్పారు. ఈమధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడివారి నీళ్ల కష్టాలు కళ్లారా చూశానని వివరించారు కేసీఆర్.