నాకు జబ్బు వచ్చినట్టు, విష ప్రచారం చేశారు-కేసీఆర్

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రవర్తించిన తీరు సిగ్గుచేటని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. రాజకీయ నాయకుల ముసుగులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అరాచక శక్తులను సర్కార్ అణచి వేస్తుంది.. కాంగ్రెస్ వారి రచ్చను టీవీల్లో ప్రపంచమంతా చూసింది అన్నారు.

సోమవారం అసెంబ్లీలో జరిగిన ఘటన గురించి మంగళవారం ప్రస్తావించిన ఆయన.. బీఏసీ సమావేశంలో అన్నింటికీ ఒప్పుకుని, సభలోకి రాగానే ఆందోళన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గత సమావేశాల్లో ప్రతిపక్షాలు ఎన్ని రోజులు కోరితే అన్ని రోజులు సభ నిర్వహించామని, ఈ సారి కూడా అలాగే నిర్వహిస్తామని చెప్పినా నిరసన తెలపడంలో ఔచిత్యం ఉందా అని కేసీఆర్ అన్నారు. హెడ్ సెట్ తగిలి మండలి చైర్మన్ కన్నుకు దెబ్బ తగిలితే నాటకమాడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని తీవ్రంగా ఖండించారు. తనకు జబ్బు వున్నట్లు నేతలు విషప్రచారం చేశారని మండిపడ్డారు.