ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి ఓదార్చారు. ఈమధ్యే గంగుల తండ్రి మల్లయ్య చనిపోయారు. సోమవారం దశదిన కర్మ కావడంతో కేసీఆర్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో కరీంనగర్ వెళ్లారు కేసీఆర్. జిల్లా కేంద్రంలోని కొండా సత్యలక్ష్మి గార్డెన్ లో కమలాకర్ తండ్రి దశదినకర్మ కార్యక్రమం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేసీఆర్. గంగులతోపాటు అతని సోదరులు వెంకన్న, సుధాకర్ లతో పాటు కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడారు.
పెద్దకర్మ అనంతరం కేసీఆర్ అక్కడి నుంచి స్పోర్ట్స్ స్కూల్ కు చేరుకున్నారు. హెలికాప్టర్ లో హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు. గంగులను పరామర్శించిన వాళ్లలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
గంగుల మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. ఆ సమయంలో కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.