అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో ప్రసంగించిన కేసీఆర్ ఇప్పటి ప్రతిపక్ష నేతలను.. ఒకప్పటి ప్రతిపక్ష నేతలను కలిపి విమర్శించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లు ఇరువురు కూడా ఇంకుడు గుంతలు అని ఒకరు.. బొంకుడు గుంతల మాటలు ఒకరు చెప్పారని విమర్శించారు. వారున్న సమయంలో రాష్ట్రంలో చెరువులు, కాలువలు అన్ని ఎండిపోయాయి.
కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాల్వలన్నీ 9 నెలలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయని అన్నారు. తెలంగాణ వాగులో నీళ్లు పారినట్లు, వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు రాలుతాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధమున్నా రాజీనామా చేస్తానని ప్రమాణం చేశారు. 2024 తర్వాత బీజేపీ కుప్పకూలడం ఖాయమని జోస్యం చెప్పారు.
ప్రధాని మోడీ నేతృత్వంలో మేకిన్ ఇండియా జోకింగ్ ఇండియా మారిందని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి దేశాన్ని నిండా ముంచాయని ఆరోపించారు. భారత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టమని కోరితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేసీఆర్ వాపోయారు. భవిష్యత్‌లో కేంద్రంలో తమ ప్రభుత్వమే వస్తుందని, మోడీ చేయలేని పనులన్నీ తాము చేసి చూపిస్తామన్నారు. దేశంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు.
ఎంత ఖర్చైనా రాష్ట్రంలో ఇకపై ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోనీయమని స్పష్టం చేశారు. 16వేల మెగావాట్ల డిమాండ్ వచ్చినా ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్న ఉద్యోగులకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే కొత్త సచివాలయం, ప్రగతి భవన్‌లపై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను పేల్చేస్తే, సచివాలయం గుమ్మటాలను కూల్చేస్తే చూస్తూ ఊరుకుంటామా అని అన్నారు. అలాంటి పనులు చేయాలనుకునేవారి కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారని సీఎం హెచ్చరించారు. అలా మాట్లాడిన వారిని ప్రజలే చూసుకుంటారని చెప్పారు.
ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను బాంబులతో పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. పేదోళ్లకు ప్రవేశం లేని ప్రగతి భవన్ వుంటే ఎంత, లేకపోతే ఎంత అని ఆయన ప్రశ్నించారు. నక్సలైట్లు పేల్చేసినా అభ్యంతరం లేదని రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కొత్త సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తామని కామెంట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే నిజాం వారసత్వ బానిస మరకలను సమూలంగా తుడిచివేస్తామని అన్నారు. భారతీయ, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సచివాలయంలో మార్పులు చేస్తామన్నారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ గా మారుస్తామని బండి ప్రకటించారు.