– ముగిసిన కేసీఆర్ ఢిల్లీ టూర్
– 25న హస్తిన వెళ్లిన సీఎం
– ఇన్నాళ్లూ ఏం చేశారో అంతా సస్పెన్స్
– సారును కలిసేందుకు జాతీయ నేతల అయిష్టత!
– అఖిలేష్ మినహా హ్యాండిచ్చిన మిగతా లీడర్లు
– కేంద్ర పెద్దలను కలవాలనుకోలేదా?
– లేక.. అపాయింట్ మెంట్స్ దొరకలేదా?
ఓవైపు వరదలతో జనం చస్తుంటే.. ఇంకోవైపు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్ అయింది. 25న సాయంత్రం ప్రత్యేక విమానంలో హస్తిన వెళ్లారు కేసీఆర్. ఎందుకు వెళ్లారో? ఎవరిని కలుస్తారో? అంతా సస్పెన్స్ గా ఉంచారు. పోనీ.. కలిశాక అన్నా అప్డేట్స్ ఉన్నాయా? అంటే అదీ లేదు. సొంత మీడియాలో మాత్రం అది చేశారు. ఇది చేస్తున్నారని హడావుడి కనిపించింది గానీ.. వాస్తవంగా అంత సీన్ లేదనే వాదన ఉంది. కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెనుక జాతీయ రాజకీయాల వ్యూహం ఉందనే చర్చ ఐదు రోజులుగా జరుగుతోంది. కానీ.. ఆ దిశగా ఎలాంటి భేటీలు సాగలేదు. కేవలం ఒక్క అఖిలేష్ ని మాత్రమే కలిశారు. ఆయనన్నా కలవడానికి కారణం.. యూపీ ఎన్నికల్లో పలు రకాలుగా సాయం చేశారన్న కృతజ్ఞతా భావమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
కేసీఆర్ ను జాతీయ నేతలు ఎవరూ కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదట. చివరికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని కూడా విపక్షం కోరలేదు. సీక్రెట్ మీటింగ్స్ జరిగాయని గులాబీ గ్యాంగ్ ప్రచారం చేసుకున్నా.. అఖిలేష్ కలిసినప్పుడు విస్తృతంగా క్యాంపెయిన్ చేసుకుని మిగతా వారి గురించి ఎందుకు చెప్పరనే ప్రశ్న ఉత్పన్నమౌతోంది. అంటే.. సారును కలిసేందుకు ఎవరూ రాలేదనేగా దీనర్థమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీల కీలక నేతలు హస్తినలోనే ఉన్నారు. కానీ.. కేసీఆర్ ను ఎవరూ కలవలేదు. తన పీఆర్ టీంతో ఇతర పార్టీల నేతల్ని పిలిపించుకునే ప్రయత్నం కేసీఆర్ చేశారని.. ఎవరూ సరిగ్గా స్పందించలేదని టాక్ నడుస్తోంది. బిహార్ లీడర్ తేజస్వి యాదవ్ సైతం వస్తానని చెప్పి హ్యాండిచ్చారని తెలుస్తోంది. ఇలా కొంత మంది నేతలు వచ్చి కలుస్తామని చెప్పి రాలేదట. దీంతో సారు బాగా హర్టయి.. దిగాలుగా తిరుగుపయనం అయ్యారని చెప్పుకుంటున్నారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కొన్నాళ్లుగా ఉవ్విళ్లూరుతున్నారు కేసీఆర్. మోడీని టార్గెట్ చేస్తే జాతీయ మీడియా కంట్లో పడొచ్చనే కారణంతో ఇష్టం వచ్చిన తిట్లన్నీ తిట్టేస్తున్నారు. కానీ.. ఏమాత్రం ఆయనకు కలిసి రావడం లేదని అనుకుంటున్నారు. గత పర్యటనల్లో కాస్త హడావుడి చేసినా.. మైలేజ్ తెచ్చి పెట్టింది కొంతవరకే. ఇప్పుడైతే.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో తత్వం బోధపడి.. నగరానికి వచ్చి తీరిగ్గా ఏం చేయాలా అనే దానిపై కేసీఆర్ ఆలోచన చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.
ఇటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కేసీఆర్ కలుస్తారనే ప్రచారం సాగింది. ఇన్ని రోజులున్నా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లలేదు ఆయన. కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరినా రాష్ట్రపతి భవన్ నుంచి రియాక్షన్ రాలేదనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. సిన్హాకు మద్దతుగా హైదరాబాద్ లో సభ పెట్టి నానా హంగామా చేశారు కేసీఆర్. ఈ కారణంగానే కేసీఆర్ కు అపాయింట్ మెంట్ దొరికి ఉండదనే చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై కేంద్రం పెద్దలతో అయినా.. కేసీఆర్ చర్చిస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. ఏ ఒక్క కేంద్రమంత్రిని కలవలేదు. ఇటీవల వచ్చిన వరదలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. గోదావరి వరదతో వందలాది గ్రామాలు రోజుల తరబడి నీట మునిగాయి. భారీగానే నష్టం జరిగిందని అధికారులు లెక్కలు వేస్తున్నారు. అయితే.. ఇన్ని రోజులు హస్తినలో ఉన్న కేసీఆర్ వరద సాయం గురించి కూడా కేంద్ర పెద్దలను కలిసి వివరించలేదు.
మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిలు, నిధులు, అప్పులపై కొత్తగా విధించిన ఆంక్షల విషయంలో చర్చించేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. రాష్ట్ర అధికారులకు దిశానిర్దేశం చేశారని.. కేంద్రంతో వారు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని చెబుతున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి అంతగా బాలేదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతం ఇవ్వలేకపోతోంది ప్రభుత్వం. కొన్ని జిల్లాలకు 15 తర్వాత కూడా అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బకాయిలు, నిధులు, అప్పులపై కేసీఆర్ చర్చలు సాగించినట్లు చెబుతున్నారు గాలాబీ నేతలు. అయితే.. ప్రజా సమస్యల గురించి కేంద్రాన్ని ఎందుకు కలవలేదనే ప్రశ్న ప్రతిపక్షాల నుంచి వ్యక్తం అవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రెండు రోజులుగా వరద సాయంపై కేంద్రంపై యుద్ధం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదో ఒక కార్యాచరణ ప్రకటించే వరకు ఢిల్లీ వదిలి రావొద్దని డిమాండ్ చేశారు. కానీ.. కేసీఆర్ సైలెంట్ గా పర్యటనను ముగించేశారు.