కేసీఆర్‌కు అతనో వీరాభిమాని. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి.. తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చేవరకూ కూడా పార్టీ కోసం ఎంతో పనిచేశాడు. కేసీఆర్‌పై అభిమానాన్ని మాటల్లో చెప్పలేక.. ఐదేళ్ల క్రితం ఏకంగా ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి.. ఏకంగా గుడి కూడా కట్టేశాడు. ఆయనే ఆదిలాబాద్ జిల్లా దండెపల్లికి చెందిన రవీందర్. అలాంటి రవీందర్ ఇప్పుడు కేసీఆర్‌పై నిప్పులు కక్కుతున్నాడు.
తాను కట్టిన ఆ గుడికి తాళం వేయడమే కాదు.. కేసీఆర్ విగ్రహానికి ముసుగేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన రవీందర్.. కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. మొదటి నుంచి టీఆర్ఎస్ కోసం ఎంతో కష్టపడిన తనకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. కొత్తగా వచ్చినవారిరకి కీలక పదవులు అప్పగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమకారులకంటే.. ఉద్యమ ద్రోహులకే పెద్దపీఠ వేస్తున్నారని మండిపడుతున్నారు. ఒకప్పటి కేసీఆర్ వీరాభిమాని రవీందర్.. ఇప్పుడు ఆయనకు పక్తు వ్యతిరేకంగా మారిపోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది.